Begin typing your search above and press return to search.

అనువాదాల మధ్య నిలబడుతుందా?

By:  Tupaki Desk   |   4 Nov 2018 11:08 AM GMT
అనువాదాల మధ్య నిలబడుతుందా?
X
సంక్రాంతి.. దసరా తర్వాత తెలుగు ప్రజలు పెద్దదిగా భావించే పండుగ దీపావళి. ఐతే మిగతా రెండు సీజన్లకు ఉన్నంత సినిమా సందడి.. దీపావళికి కనిపించదు. ఆ సమయంలో పెద్ద సినిమాలు ఎప్పుడో కానీ రావు. ఈ ఏడాది పరిస్థితి మరీ తీసికట్టుగా ఉంది. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అదుగో’ తప్ప మరే తెలుగు సినిమా పండక్కి రావట్లేదు. నిజానికి ఈ సినిమా కూడా ముందు ఈ పండక్కి షెడ్యూల్ అయి లేదు. దసరాకే రిలీజ్ చేయాలనుకున్నారు. ఐతే అప్పుడు కుదరక.. దీపావళికి మరే సినిమా లేదని దీన్ని ఆ పండక్కి వదలుతున్నారు. ఈ చిత్రం రెండు అనువాద సినిమాలతో పోటీకి దిగుతుండటం విశేషం. ఐతే ‘అదుగో’తో పోలిస్తే అనువాదాలకే కొంచెం క్రేజ్ కనిపిస్తోందిప్పుడు.

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రాన్ని దీపావళి కానుకగా తమిళంలో చాలా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య విజయ్ కి తెలుగులోనూ కొంచెం ఫాలోయింగ్ రావడం.. పైగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ‘సర్కార్’ తెలుగులోనూ కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజవుతోంది. మరోవైపు అమీర్ ఖాన్ నటించిన హిందీ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. మామూలుగా అమీర్ సినిమాలు తెలుగులో రిలీజ్ కావు. కానీ దీన్ని మాత్రం తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో పెద్ద ఎత్తునే రిలీజ్ చేస్తున్నారు. రవిబాబు సినిమా ‘అదుగో’ వాయిదాల మీద వాయిదాలు పడి చాలా ఆలస్యంగా రిలీజవుతోంది. దీని ప్రోమోలు మరీ అంత ఎగ్జైటింగ్ గా ఏమీ లేవు. ‘బాహుబలి’ లాంటి సినిమాలు చూశాక ఇందులోని విజువల్ ఎఫెక్ట్స్ చాలా సాధారణంగా అనిపిస్తున్నాయి. ఇందులో హీరో అయిన పంది పిల్లలో సహజత్వం కనిపించడం లేదు. మరి రవిబాబు దీనితో ఎలాంటి వినోదం పండించాడన్నది చూడాలి. ఒక సినిమాతో అదరగొట్టే రవిబాబు.. ఇంకో సినిమాతో తీవ్రంగా నిరాశ పరుస్తుంటాడు అతడిలో నిలకడ ఉండదు. మరి మంచి క్రేజ్ మధ్య రిలీజవుతున్న అనువాదాల మధ్య ‘అదుగో’ ఏమాత్రం నిలబడుతుందో చూడాలి.