Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: కొత్త బ్యాన‌ర్లు ఫ‌స‌క్

By:  Tupaki Desk   |   21 Nov 2019 5:07 AM GMT
టాప్ స్టోరి: కొత్త బ్యాన‌ర్లు ఫ‌స‌క్
X
తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ మారుతోంది. సినిమా క‌థ‌ల పరంగా.. మేకింగ్ ప‌రంగా కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫిలింమేక‌ర్స్ పుట్టుకొస్తూనే వున్నారు. పాత వాళ్లు మారిన ట్రెండ్ ని ప‌ట్టుకోలేక చేతులెత్తేస్తుంటే కొత్త వాళ్లు మాత్రం ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో హంగామా చేస్తున్నారు. ఈ రేసులో స్టార్ హీరోలు.. క్రేజీ యంగ్ హీరోలు కూడా చేర‌డంతో పోటీ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. కొంత మంది ఇప్ప‌టికే సొంత బ్యాన‌ర్ లు స్థాపించి స‌క్సెస్ సాధిస్తే మ‌రి కొంత మంది హీరోలు ఇప్పుడిప్పుడే ప్రొడ‌క్ష‌న్ వైపు అడుగులు వేస్తున్నారు. ప‌రిమిత బ‌డ్జెట్ల‌తో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీసేందుకు తొలి ఫేజ్ లో ఉన్నారు.

స్టార్ హీరోల్లో మ‌హేష్ బాబు ఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ ని స్థాపించి 'శ్రీ‌మంతుడు' చిత్రాన్ని స్వీయ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కించారు. 'స‌రిలేరు నీకెవ్వ‌రు' చిత్రానికి నిర్మాణ‌ భాగ‌స్వామిగా వ్య‌వ‌రిస్తున్నారు. త్వ‌ర‌లో ఇదే బ్యానర్‌పై మ‌రిన్ని మీడియం స్థాయి చిత్రాల్ని నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అడివి శేష్ తో మేజ‌ర్ మూవీ ఈ త‌ర‌హానే. ఎన్‌టిఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై ఇప్ప‌టికే క‌ల్యాణ్ రామ్ చాలా చిత్రాల్ని నిర్మించారు. ఇక‌పై కూడా వ‌రుస‌గా చిత్రాల్ని నిర్మించాల‌నుకుంటున్నారు. యంగ్ హీరో నాని వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్ ని ప్రారంభించాడు. తొలి ప్ర‌య‌త్నంగా 'డీ ఫ‌ర్ దోపిడి' చిత్రానికి భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించాడు. మ‌రో యంగ్ హీరో నాగ‌శౌర్య ఐరా క్రియేష‌న్స్ లో వ‌రుస‌గా సినిమాలు తీస్తున్నారు. ఛ‌లో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని ఈ బ్యాన‌ర్ లో తెర‌కెక్కించి ప్ర‌స్తుతం మ‌రో సినిమాని ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవ‌ల వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్ పై 'అ!' చిత్రాన్ని నిర్మించిన నాని తాజాగా 'ఫ‌ల‌క్ నుమాదాస్‌' ఫేమ్ విశ్వ‌క్‌సేన్ హీరోగా 'హిట్‌' చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ సైతం కింగ్ ఆఫ్ ది హిట్ బ్యాన‌ర్ ప్రారంభించి స్నేహితుడు త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా మొద‌టి సినిమా తెర‌కెక్కించాడు. ఈ బ్యాన‌ర్ లో వ‌రుస‌గా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ సోద‌రుడు ఆనంద్ ఇందులో న‌టిస్తాడ‌ట‌.

ప్ర‌భాస్ ఇప్ప‌టికే పెద్ద రేంజు నిర్మాత‌. గోపికృష్ణ బ్యాన‌ర్ ఎప్ప‌టి నుంచో ఉంది. అలాగే యువిక్రియేష‌న్స్ త‌న స్నేహితుల బ్యాన‌ర్ మాత్ర‌మే కాదు త‌న సొంత బ్యాన‌ర్ తో స‌మానం. అల్లు అర్జున్ కూడా జీఏ బ్యాన‌ర్ తో సంబంధం లేకుండా సొంతంగా ఏఏఏ పేరుతో ఓ బ్యాన‌ర్ ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. మంచు మ‌నోజ్ ఎం.ఎం. ఆర్ట్స్ బ్యాన‌ర్ పై వినూత్న‌మైన చిత్రాల్ని నిర్మించ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ల‌క్ష్మి మంచు నిర్మాత‌గా సీనియ‌ర్. సొంత బ్యాన‌ర్ పై సినిమాలు తీశారు. నిహారిక కొణిదెల‌.. వ‌రుణ్ తేజ్ సైతం సొంత బ్యాన‌ర్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇలా చాలా మందే సొంత కుంప‌టి పెట్టుకుని వ‌రుస‌గా సినిమాలు లేదా వెబ్ సిరీస్ లు చేయడానికి సిద్ధ‌మ‌వుతుండ‌టం శుభ‌ప‌రిణామం. ఓ వైపు చిన్న సైజ్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ వెబ్ సిరీస్ ల‌ను లాగించేసేందుకు సొంత‌ బ్యాన‌ర్లు అవ‌స‌రం అవుతున్నాయి. అందుకే ఎవ‌రికి వారు త‌మ ప్లానింగ్స్ తో దూసుకెళుతున్నారు.