Begin typing your search above and press return to search.

కొరియన్ సినిమాలు లేకపోతే వీళ్లేమవుతారో?

By:  Tupaki Desk   |   6 July 2019 4:22 AM GMT
కొరియన్ సినిమాలు లేకపోతే వీళ్లేమవుతారో?
X
సినిమా అంటేనే సృజనాత్మకతకు వేదిక. దేవుడు అందరికి ఇవ్వలేని వరాన్ని కళాకారులకు ఇస్తాడు. అందులోనూ దర్శకులు రచయితలది విశిష్ట స్థానం. మన స్వంతం అని రాసుకున్నది చేసేది ఏదైనా సరే దాని కిక్కే ఇంకో లెవెల్ లో ఉంటుంది. కానీ గత కొన్నేళ్లుగా ట్రెండ్ ని గమనిస్తే కొందరు తెలుగు దర్శకులు పూర్తిగా కొరియన్ సినిమాల మీద ఆధారపడి అవి లేకపోతే తమ మనుగడ లేదన్న తరహాలో అతిగా ఆధారపడటం చూస్తే కొంత బాధ కలగక మానదు.

నిన్న విడుదలైన రెండు సినిమాల్లో ఒకటి హిట్ టాక్ తో మరొకటి డిజాస్టర్ రిజల్ట్ వైపు పరుగులు పెడుతున్నాయి. ఒకటి అఫీషియల్ కొరియన్ రీమేక్ కాగా మరొకటి అనధికారికంగా స్ఫూర్తి చెందినది . ఇవే కాదు గత ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే చాలా సినిమాలు ఇలా కొరియన్ సినిమాల నుంచి కాపీ కొట్టినవే .

ఇదేమీ నేరము కాదు తప్పు కాదు. కాని స్వంత మెదడుకు పదును పెట్టకుండా క్రియేటివిటీకి పని చెప్పకుండా విదేశీ సినిమాలను తెలుగీకరించడం సులభమే. బాష మీద పట్టున్న ఓ నలుగురు ఘోస్ట్ రైటర్లను పెట్టుకుంటే సరి. పనైపోతుంది.

కాని కొందరి వరస చూస్తే మాత్రం ఎంత పెద్ద స్టార్ అయినా మీడియం రేంజ్ హీరో అయినా ఓ ఐదారు కొరియన్ కథలను సిద్ధం చేసి పెట్టుకుని వాళ్ళు పిలవడం ఆలస్యం అవే వినిపించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటున్నారు. కొన్ని ఆడుతున్నాయి. కొన్ని పేలుతున్నాయి. గత ఏడాది చేతికి విచిత్రమైన లక్షణమున్న కథతో చేసిన సినిమాలో మొదటి సీన్ మక్కికి మక్కి ఓ ఫారిన్ సినిమా నుంచి దించేయడం ప్రేక్షకులు ఈజీగానే గుర్తుపట్టేశారు. ఇలాంటి ఉదాహరణలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో కొందరు దర్శకుల బ్యాచ్ కు కొరియన్ సినిమాలు కనక అందుబాటులో లేకపోతే ఏమైపోతారో అనే అనుమానం కలుగుతుంది