Begin typing your search above and press return to search.

టైర్‌ 2 హీరోలు కూడా అంత తీసుకుంటే ఎలా బాసూ?

By:  Tupaki Desk   |   14 July 2021 9:02 AM GMT
టైర్‌ 2 హీరోలు కూడా అంత తీసుకుంటే ఎలా బాసూ?
X
టాలీవుడ్‌ స్టార్ హీరోల పారితోషికాలు అమాంతం పెరిగి పోయాయి. వారి సినిమాలు వందల కోట్లు వసూళ్లు చేయగల సత్తాను కలిగి ఉంటాయి కనుక నిర్మాతలు ఆ హీరోలకు భారీ పారితోషికం ఇచ్చినా కూడా రికవరీకి 99 శాతం భరోసా ఉంటుంది. మహేష్‌ బాబు.. పవన్‌.. ఎన్టీఆర్‌ వంటి ఇతర స్టార్‌ హీరోల పై నిర్మాతలు వందల కోట్ల పెట్టబడి పెట్టినా కూడా మినిమంగా ఆడినా కూడా నిర్మాతలకు లాభాలు వస్తాయి. కొందరు హీరోల సినిమాలు ప్లాప్ అయినా కూడా మినిమంగా వసూళ్లు అనేవి వస్తాయి కనుక వారి పారితోషికం భారీగా ఉన్న పర్వాలేదు. కాని టైర్‌ 2 హీరోల సినిమాలు సూపర్‌ హిట్‌ అయితే తప్ప వసూళ్లు వచ్చే పరిస్థితి ఉండదు.

టైర్‌ 2 హీరోల్లో ఇద్దరు ముగ్గురు మాత్రమే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా జనాలను థియేటర్లకు తమ స్టామినాతో తీసుకురాగలరు. వారు కూడా కొన్ని సార్లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడి నిర్మాతలకు కోట్ల నష్టం మిగిల్చిన సందర్బాలు ఉన్నాయి. కనుక టైర్‌ 2 హీరోల పారితోషికాల విషయంలో కాస్త నిర్మాతలు ఆందోళనతో ఉన్నారు. టైర్‌ 2 హీరోల్లో కొందరు పది నుండి పదిహేను కోట్ల వరకు డిమాండ్‌ చేస్తున్నారనే టాక్ ఉంది. టైర్‌ 2 హీరోలు పది కోట్లకు మించి పారితోషికం తీసుకుంటే సినిమా బడ్జెట్‌ పాతిక కోట్లకు మించి పెట్టాల్సి వస్తుంది. కొన్ని సినిమాల కథల డిమాండ్ మేరకు 30 నుండి 35 కోట్ల వరకు కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది. అప్పుడు నిర్మాత హెవీ రిస్క్‌ ను ఫేస్ చేయాల్సి వస్తుంది.

సినిమాకు సూపర్‌ హిట్‌ టాక్ వచ్చి పోటీ లేకుంటేనే వసూళ్లు నమోదు అవుతాయి. పెట్టిన పెట్టుబడి సినిమా ప్లాప్‌ అయినా కూడా వచ్చినట్లయితేనే నిర్మాతల మనుగడ సాధ్యం. కనుక చిన్న హీరోలు అయినా తమ సినిమాల బడ్జెట్‌ లు 15 నుండి 20 కోట్ల మద్య ఉండేలా చూసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పది కోట్లకు లోపు పారితోషికంగా తీసుకుంటే 10 నుండి 15 కోట్ల వరకు మేకింగ్‌ కు ఖర్చు చేసేలా ప్లాన్‌ చేయడం వల్ల నిర్మాతలు కూడా సేఫ్‌ అవుతారు.

టైర్‌ 2 హీరోలు సినిమాలు సక్సెస్‌ అయినా ప్లాప్‌ అయినా కూడా థియేట్రికల్‌.. శాటిలైట్ మరియు ఓటీటీ బిజినెస్ ల ద్వారా ఆ మొత్తం ను రాబట్టగలరు. సినిమా సక్సెస్‌ అయితేనే నిర్మాతకు లాభాల సంగతి. కనుక టైర్‌ 2 హీరోలు నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తక్కువ పారితోషికం తో సినిమాలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తక్కువ పారితోషికం తీసుకుని ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయడం వల్ల హీరోలు అంతకు మించి సంపాదించుకోవచ్చు అంటూ కొందరు సూచిస్తున్నారు.

యంగ్‌ హీరోల సినిమాల బడ్జెట్ లు ఈమద్య కాలంలో 30 నుండి 50 కోట్లకు పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాతలకు భారీగా నష్టాలు తప్పడం లేదు. చిన్న హీరోలు ఒకటి రెండు సక్సెస్‌ లు వచ్చిన వెంటనే తమ పారితోషికంను అమాంతం పెంచేయకుండా సినిమాల సంఖ్య పెంచుకుంటే మంచిది అని.. మంచి నిర్మాతలను మరియు దర్శకులను పట్టుకుని సినిమా లు చేస్తే టాప్ స్టార్ హీరోల జతన నిలిచే అవకాశాలు ఉంటాయి. స్టార్‌ హీరోలకు పోటీగా పారితోషికం తీసుకుంటాం.. మా సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో ఉండాలనుకుంటే మాత్రం టైర్ 2 హీరోల వల్ల నిర్మాతలు చాలా నష్టపోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.