Begin typing your search above and press return to search.

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేస్తున్న టాలీవుడ్ స్టార్స్..!

By:  Tupaki Desk   |   5 Jun 2021 2:00 PM IST
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేస్తున్న టాలీవుడ్ స్టార్స్..!
X
నేడు (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం. రోజురోజుకూ భూగోళంపై పచ్చదనం తగ్గిపోవడం.. కొన్ని రకాల జీవరాశులు నశించిపోవడం వలన పర్యావరణానికి పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని గుర్తు చేస్తూ.. ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాలని ప్రతీ ఏటా జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కలిగిస్తుంటారు. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌ తో పర్యావరణ సదస్సులను నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా ద్వారా పర్యావరణాన్ని పరిరక్షణకు పిలుపునిస్తున్నారు.

వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేస్తూ ''రోజు రోజుకు మరింత నాశనం అవుతున్న పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి పునఃరూపకల్పన చేయడానికి ఈరోజు ప్రతిజ్ఞ చేద్దాం. మన భూగ్రహాన్ని పచ్చగా మార్చడానికి ప్రయత్నిద్దాం!'' అని పేర్కొన్నారు. ''మనకు ఉన్న ఏకైక ఇల్లు భూమి - దానిని నాశనం చేయడాన్ని ఆపేద్దాం. బదులుగా బాగు చేయడానికి సమయమిద్దాం. అందరం చేతులు కలిపి మన ఇంటిని రక్షించుకుందాం'' అని మెగా హీరో సాయి తేజ్ ట్వీట్ చేశారు.

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న ఇంటి వ‌ద్ద మొక్కను నాటి అంద‌రూ మొక్కలు నాటాల‌ని పిలుపునిచ్చాడు. ''ఈ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా మొక్క‌ల‌ను నాటుతామ‌ని, ఎకో ఫ్రెండ్లీ అల‌వాట్ల‌ను అలవరుచుకుందామని.. భ‌విష్య‌త్తు త‌రాల కోసం మ‌న‌ భూమిని ప‌చ్చ‌ద‌నంగా మార్చుదామని ప్ర‌తిజ్ఞ చేద్దాం. ప్ర‌తి ఒక్క‌రూ చొర‌వ తీసుకొని మొక్కలు నాటాలని కోరుతున్నాను. ఆ ఫోటోలను పోస్ట్ చేస్తే వాటిల్లో కొన్నింటిని నేను రీషేర్ చేస్తాను. భూమిని ర‌క్షించుకునేందుకు మ‌నంద‌రం కలిసి ప‌ని చేద్దాం" అని బన్నీ ట్వీట్ చేశాడు. మొక్క నాటి నీళ్లు పోస్తున్న ఓ ఫోటోని అల్లు అర్జున్ షేర్ చేశాడు.