Begin typing your search above and press return to search.

సీఎం జగన్ కు టాలీవుడ్ నిర్మాతల కృతజ్ఞతలు

By:  Tupaki Desk   |   19 Dec 2020 9:15 AM IST
సీఎం జగన్ కు టాలీవుడ్ నిర్మాతల కృతజ్ఞతలు
X
కరోనా దెబ్బకు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ, థియేటర్ల రీస్టార్ట్ కు ప్రత్యేక ప్యాకేజి ఉంటుందని సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ నిర్మాణ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. ఏపీ సర్కార్ కు, సీఎం జగన్ కు పలువురు టాలీవుడ్ నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. చిత్ర పరిశ్రమకు సీఎం జగన్ చేసిన సాయం ఎనలేనిదని ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత ఎన్వీ ప్రసాద్ కొనియాడారు. సీఎం జగన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపింది. ఈ మినహాయింపులు ఇండస్ట్రీ, థియేటర్ల పునఃప్రారంభానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొంది. చిత్ర పరిశ్రమ కోసం రీస్టార్ట్ ప్యాకేజి ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది. రీస్టార్ట్ ప్యాకేజి వల్ల ఇండస్ట్రీపై ఆధారపడిన ఎంతోమందికి మేలు జరుగుతుందని తెలిపింది.

ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కు చెందిన ఎస్వీసీసీ కూడా సీఎం జగన్ కు రుణపడి ఉంటామని తెలిపింది. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభం వల్ల ఇండస్ట్రీ ఇబ్బందులు పడుతోన్న సమయంలో ప్రభుత్వం ఆదుకుందని, సకాలంలో ప్రకటించిన ఈ చర్యలు ఇండస్ట్రీపై ఆధారపడి ఉన్న లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతాయని భావిస్తున్నామని తెలిపింది. సీఎం జగన్ ఆధ్వర్యంలోని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజి యావత్ తెలుగు సినీ రంగాన్ని పునర్నిర్మించేందుకు దోహదపడుతుందని పలువురు నిర్మాతలు అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమకు ఊరటనిచ్చే పలు నిర్ణయాలను ఏపీ కేబినెట్ తీసుకున్న సంగతి తెలిసిందే. 3 నెలల పాటు సినిమా హాళ్లు చెల్లించాల్సిన ఫిక్స్ డ్ విద్యుత్ చార్జీల రద్దు, మిగిలిన 6 నెలల ఫిక్స్ డ్ విద్యుత్ చార్జీల చెల్లింపు వాయిదా, థియేటర్లకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, రుణ చెల్లింపులపై 6 నెలల వరకు మారటోరియం, ఆ తర్వాత ఏడాది నుంచి 4.5 శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరించడం వంటి పలు నిర్ణయాలను జగన్ సర్కార్ తీసుకుంది. కరోనా ప్రభావంతో దెబ్బతిన్న సినీ పరిశ్రమ, థియేటర్లను ఈ నిర్ణయాలు ఆదుకుంటాయని నిర్మాణ సంస్థలు, థియేటర్ యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి.