Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: టాలీవుడ్ గ‌ప్ చుప్ ఇంకెన్నాళ్లు?

By:  Tupaki Desk   |   11 July 2020 10:45 AM IST
ట్రెండీ టాక్: టాలీవుడ్ గ‌ప్ చుప్ ఇంకెన్నాళ్లు?
X
2020 టాలీవుడ్ కి బ్యాడ్ ఇయ‌ర్ అని డిక్లేర్ అయ్యింది. వేస‌వి లేదు. ద‌స‌రా లేదు. చివ‌రికి క్రిస్మ‌స్ ఆశ‌లు కూడా అడుగంటిపోతున్నాయ్. అంటే దీన‌ర్థం ఇక ఈ ఏడాది అంతా ఖాళీ అనే. ఏడాది ఆరంభం ఒకే ఒక్క సంక్రాంతి మాత్రం ఆదుకుంది. అల వైకుంఠ‌పుర‌ములో- భీష్మ లాంటి చిత్రాలు బంప‌ర్ హిట్లు కొట్ట‌డం క‌లిసొచ్చింది. స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి పెద్ద చిత్రం రిలీజైన ఉత్సాహం అభిమానుల‌కు క‌లిగింది.

ఇప్ప‌టికిప్పుడు రెండు డ‌జ‌న్ల సినిమాలు రిలీజ్ క్యూలో ఉన్నా.. ఏవీ రిలీజ్ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఊహించ‌ని పిడుగులా మీద ప‌డిన మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ అల్ల‌క‌ల్లోలం చేసింది. వేస‌విని నిండా ముంచేసింది. క‌నీసం ద‌స‌రా అయినా రిలీజ్ ల‌కు క‌లిసొస్తుందేమో అనుకుంటే మ‌హ‌మ్మారీ ప‌దింత‌లు పెరిగేట్టే క‌నిపిస్తోంది కానీ త‌గ్గ‌డం లేదు. క‌రోనాతోనే స‌హ‌జీవ‌నం అంటూ లాక్ డౌన్లతో ప‌నిలేద‌ని ప్ర‌భుత్వాలు తేల్చేయ‌డంతో ప్ర‌జ‌ల్లో అల్ల‌క‌ల్లోలంగానే ఉంది ప‌రిస్థితి.

స్కూల్స్.. థియేట‌ర్లు ఇప్ప‌ట్లో తెర‌వ‌రు. ప్ర‌భుత్వాలు అనుమ‌తించ‌వు. అందువ‌ల్ల ఇక సినిమాల రిలీజ్ ల‌కు ఆస్కారం అన్న‌దే లేదు.ఈ ఏడాదికి థియేట‌ర్ వినోదం జీరో. ఆ క్ర‌మంలోనే ఓటీటీ- హోం థియేట‌ర్లు మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు దిక్కు అని విశ్లేషిస్తున్నారు. అక్టోబ‌ర్ లో ద‌సరాని పుర‌స్క‌రించుకుని ఏదైనా చేయాల‌న్నా అప్ప‌టికీ వ్యాక్సీన్ టీకా ఏదీ వ‌చ్చేట్టు లేదు. క‌నీసం ఏడాది చివ‌రిలో క్రిస్మ‌స్ పండ‌గ నాటికి అయినా జీసస్ క‌రుణిస్తాడా? అంటే క‌ష్టంగానే ఉంది ప‌రిస్థితి. డిసెంబ‌ర్ ఆశ‌ల్ని ఇక సినిమావాళ్లు గాలికొదిలేసిన‌ట్టే.

ఆ త‌ర్వాత సంక్రాంతి అయినా క‌నిక‌రిస్తుందా? అంటే అదీ లేదు. సంక్రాంతి త‌ర్వాత అయినా రిలీజ్ ల‌కు ఆస్కారం ఉంటుందా? షూటింగుల‌కు వెళ్లే వీలుంటుందా? అంటే... ప్చ్! అనేస్తున్నారు. ఎందుకంటే ప్ర‌స్తుతం క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో ఉన్న వ్యాక్సీన్లు పూర్తిగా మ‌నుషుల‌పై ప్ర‌యోగాల‌న్నీ పూర్తి చేయాలంటే ఏడాది లేదా రెండేళ్లు ప‌ట్టొచ్చ‌న్న‌ది శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్న మాట‌. మరో మూడు నెల‌ల్లో వ్యాక్సీన్లు తెచ్చేస్తామ‌ని ప‌లు కంపెనీలు చెబుతున్నా.. శాస్త్రీయ‌త ఎంత‌? అన్న‌ది వేచి చూడాల్సిన ప‌రిస్థితి. తిరిగి షూటింగుల‌కు.. థియేట‌ర్లు తెరుచుకునేందుకు య‌థాత‌థ స్థితి రావాలంటే మ‌రో రెండేళ్లు వేచి చూడాల్సిందేన‌నేది ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుస‌. మ‌రి అప్ప‌టివ‌ర‌కూ ఇలానే ఉండాలంటే ఈ రంగంలోని కార్మికుల సంగ‌తేమిటో!!