Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పెద్దలు జగన్ని కలవరా... ?

By:  Tupaki Desk   |   23 Dec 2021 11:00 PM IST
టాలీవుడ్ పెద్దలు జగన్ని కలవరా... ?
X
ముసుగులో గుద్దులాట సాగుతోంది. తెలుగు చలన చిత్ర రంగం ఏపీ సర్కార్ తీరు మీద గుర్రుగా ఉంది. కానీ బయటపడడంలేదు. అంతా బాగానే ఉంది అంటున్నట్లుగానే కధ నడుపుతోంది. అయితే ఏపీలో టికెట్ల వ్యవహారం టాలీవుడ్ ని ఇబ్బంది పెడుతోంది. అది ఎలాంటి ఇబ్బంది అన్నది రీసెంట్ గా విడుదలై మంచి కలెక్షన్స్ సాధించిన అఖండ, పుష్ప వంటి బడా మూవీస్ నిరూపించాయి. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఏపీలోని కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడం గగనమవుతోంది.

ఇది టాలీవుడ్ కి కలవరపెడుతున్న విషయమే. అయితే దీని మీద పెద్ద తలకాయలు అనబడే వారు మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు. ఆ మధ్యన రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏకంగా స్టేజ్ మీదనే మాట్లాడారు. ఏపీ సర్కార్ మధ్యన ఎవరు అంటూ ఆయన గట్టిగానే నిలదీశారు. సినిమాలకు టికెట్లు డిసైడ్ చేస్తూ ప్రభుత్వం పెత్తనం మధ్యలో ఏంటి అని కూడా పవన్ నాడు గర్జించారు.

అయితే పవన్ మాట్లాడిన తరువాత కూడా టాలీవుడ్ పెద్దలు అదే మా మాట అని అందిపుచ్చుకోలేదు. ఆయన అన్నది తప్పు అన్నట్లుగా కొందరు వ్యవహరించారు. ఇదిలా ఉండగానే ప్రభుత్వం టికెట్ల ధరల తగ్గింపు జీవో 35ని విడుదల చేసింది. దాని మీద థియేటర్ల యజమానులు కోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ సాగుతోంది.

అదే టైమ్ లో ప్రభుత్వం థియేటర్లు నిబంధలను పాటించడం లేదని కొన్నింటిని సీజ్ చేసింది. మరో వైపు తక్కువ రేట్లతో థియేటర్లు నడపలేమని ఎగ్జిబిటర్లు మండిపడుతున్నారు. కొందరు అయితే స్వచ్చందంగా ఏపీలో సినిమా హాల్స్ ని మూసుకుంటున్నారు. దీని మీద థియేటర్ల యాజమాన్య సంఘం కూడా ఏదో ఒకటి తేల్చుకోవాలనుకుంటోంది.

ఇంతలో నటుడు నాని ఫైర్ అయ్యారు. ఆయన ఏకంగా ఏపీ సర్కార్ మీద విమర్శలు చేశారు. తక్కువ ధరలు అయితే సినిమాకు కుదిరే అవకాశం కాదని కూడా నాని అంటున్నారు. ప్రేక్షకులను అవమానిస్తున్నారు అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. దానికి అటు నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి చెప్పుకోండి అని బొత్స అసలు విషయం చెప్పేశారు.

అంటే ఇక్కడ ఒకటి అర్ధం చేసుకోవాలి. టాలీవుడ్ లో పెద్దలుగా అనబడే వారు వచ్చి జగన్ని కలిస్తే ఇగోస్ అవచ్చు, గ్యాప్స్ అవచ్చు, అలా ఏమైనా ఉంటే అవన్నీ తగ్గి సమస్యలు పరిష్కారం అయితే ఉండొచ్చేమో. కానీ విషయం మాత్రం అలా లేదు, పెద్దలు సైలెంట్ గా ఉంటే థియేటర్ల యజమానులు, నాని లాంటి హీరోలు మాత్రమే మాట్లాడుతున్నారు. దీంతో ఇది మరింతగా ముదిరిపోతోంది.

ఇక్కడ ఒక్కటి మాత్రం పక్కా క్లారిటీగా చెప్పుకోవాలేమో. ఏపీ ప్రభుత్వ పెద్దలను స్వయంగా కలసి టాలీవుడ్ పెద్దలు విన్నవించుకోవడమే బెటర్ అన్నదే ఆ మాట. మరి అది జరుగుతుందా. రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న తరువాత జగన్ మీద ప్రజా వ్యతిరేకత పెరిగింది అని భావిస్తున్న వేళ మరో రెండున్నరేళ్ళు ఇలాగే సైలెంట్ గా ఉంటామన్న ధోరణితో ఎవరైనా ఉన్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఏది ఏమైనా ఏపీ సర్కార్ తో టాలీవుడ్ కి గ్యాప్ అన్నది బాగా పెరిగింది అన్నది వాస్తవం. అటూ ఇటూ కూడా దాన్ని పూడ్చే ప్రయత్నం చేయడానికి ఎవరూ చొరవ చూపించలేకపోతున్నారు. మధ్యలో కొందరు హార్ష్ గా మాట్లాడితే కధ మరింత బిగుసుకుంటుంది తప్ప మరేమీ కాదు, మొత్తానికి జగన్ని టాలీవుడ్ పెద్దలు కలుస్తారా. కలవరా ఇదే పాయింట్ మీద తెలుగు చిత్ర సీమ సమస్యల పరిష్కారం ఆధారపడి ఉందనుకోవాలి.