Begin typing your search above and press return to search.

చిన్న, మీడియం రేంజ్ సినిమాల సందడే సందడి..!

By:  Tupaki Desk   |   1 Jun 2022 11:30 PM GMT
చిన్న, మీడియం రేంజ్ సినిమాల సందడే సందడి..!
X
కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన పాన్ ఇండియా సినిమాలు - పెద్ద హీరోల చిత్రాలన్నీ గడిచిన ఐదు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. జనవరిలో 'బంగార్రాజు' మొదలుకొని.. మేలో 'ఎఫ్ 3' సినిమాతో పెద్ద సినిమాల హంగామా ముగిసింది. మళ్లీ ఆగస్ట్ నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాల సందడి మొదలవుతుంది. ఈ మధ్యలో జూన్ - జూలై నెలల్లో చిన్న మీడియం రేంజ్ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.

'మేజర్' సినిమాతో జూన్ నెల ప్రారంభం కాబోతోంది. అడివి శేష్ టైటిల్ రోల్ పోషించిన ఈ బయోపిక్ ఈ నెల 3వ తారీఖున విడుదల అవుతుంది. అదే రోజున కమల్ హాసన్ నటించిన 'విక్రమ్'.. అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాలు వస్తున్నాయి కానీ.. డబ్బింగ్ సినిమాలు తెలుగులో 'మేజర్' కు పోటీ కాదనే అనుకోవాలి.

జూన్ రెండో వారంలో అంటే జూన్ 10న నాని హీరోగా నటించిన 'అంటే సుందరానికి' సినిమా రాబోతోంది. అదేరోజు కన్నడ డబ్బింగ్ సినిమా '777 చార్లీ' వస్తుంది కానీ.. దాన్ని పోటీగా భావించలేం. జూన్ 17న ప్లాన్ చేసిన రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా వాయిదా పడటంతో.. ఆ తేదీన రానా నటించిన 'విరాటపర్వం' సినిమాని తీసుకొస్తున్నారు.

కాకపోతే సత్యదేవ్ 'గాడ్సే' సినిమాని కూడా జూన్ 17వ తేదీనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆ మధ్య ప్రకటించారు. జూన్ 24న కిరణ్ అబ్బవరం నటించిన 'సమ్మతమే' సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారు. స్లాట్ దొరికితే 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' చిత్రాన్ని కూడా అప్పుడే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

జూలై నెలలోనూ మీడియం రేంజ్ సినిమాల సందడే కనిపించనుంది. 1వ తేదీన గోపీచంద్ 'పక్కా కమర్షియల్' సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అదే రోజు ప్లాన్ చేసిన 'విరాట పర్వం' జూన్ లోకి షిఫ్ట్ అవడంతో.. ఆ ప్లేస్ లో పంజా వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా' చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

జూలై 8వ తేదీన అక్కినేని నాగ చైతన్య నటించిన 'థ్యాంక్యూ' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామ్ పోతినేని 'ది వారియర్' చిత్రాన్ని జూలై 14న విడుదల చేయనున్నారు. నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న 'కార్తికేయ 2' సినిమాని జూలై 22న ప్లాన్ చేశారు. అడివి శేష్ 'హిట్ 2' సినిమాని నెలాఖరున జూలై 29న థియేటర్లలోకి తీసుకొస్తారు.

ఇలా రాబోయే రెండు నెలలు స్లాట్స్ బుక్ అయ్యాయి. అయితే బాక్సాఫీస్ వద్ద పోటీ లేకుండా వారానికో సినిమా లెక్కన ప్లాన్ చేసుకున్నారు. పాండమిక్ వల్ల గత మూడు నెలల్లో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితులు ఉండేవి. పెద్ద సినిమాలన్నీ ఆల్రెడీ వచ్చేయడంతో ఇప్పుడు విడుదల తేదీల విషయంలో గందరగోళం లేదు. పోటీ లేకుండా అందరూ పెర్ఫెక్ట్ గా రిలీజులు ప్లాన్ చేసుకుంటున్నారు.