Begin typing your search above and press return to search.

అక్టోబర్ మాసం.. మేకర్స్ కు నేర్పిన పాఠం..!

By:  Tupaki Desk   |   2 Nov 2022 1:30 PM GMT
అక్టోబర్ మాసం.. మేకర్స్ కు నేర్పిన పాఠం..!
X
ఈసారి అక్టోబర్ నెలలో దసరా మరియు దీపావళి వంటి రెండు ఫెస్టివల్ సీజన్స్ వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు జనాలతో కళకళలాడతాయని.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరింత సందడి కనిపిస్తుందని అందరూ భావించారు. కానీ ఇబ్బడిముబ్బడిగా సినిమాలైతే రిలీజ్ అయ్యాయి కానీ.. ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయాయి.

దసరా స్పెషల్ గా అక్టోబర్ మొదటి వారంలో మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్ - కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్' - సితారా వారి 'స్వాతిముత్యం' సినిమాలు విడుదలయ్యాయి. వీటిల్లో 'గాడ్ ఫాదర్' సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఫైనల్ రన్ లో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. మిగతా రెండు చిత్రాలు కూడా పరాజయాలుగానే మిగిలిపోయాయి.

రెండో వారంలో అర డజనుకు పైగానే సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వచ్చాయి. 'క్రేజీ ఫెలో' 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' 'కాంతారా' 'గీత' 'తెలుగు అమ్మాయి గుజరాత్ అబ్బాయి' 'నిన్నే పెళ్లాడుతా' 'నీతో' 'రారాజు' 'నా వెంటపడుతున్న చిన్నడెవడమ్మా' వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి.

అయితే వీటిల్లో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేసిన డబ్బింగ్ సినిమా 'కాంతారా' మాత్రమే ఆడియన్స్ ను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఎప్పుడు వచ్చాయో తెలియకుండానే అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి.

మూడో వారం దీపావళి కానుకగా విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' - మంచు విష్ణు 'జిన్నా' - శివ కార్తికేయన్ 'ప్రిన్స్' - కార్తీ 'సర్దార్' - అక్షయ్ కుమార్ 'రామ్ సేతు' వంటి చిత్రాలు తెలుగులో విడుదల అయ్యాయి. వీటిలో అన్నపూర్ణ స్టూడియోస్ వారు రిలీజ్ చేసిన 'సర్దార్' సినిమా బాక్సాఫీస్ వద్ద డామినేషన్ చూపించింది.

'ఓరి దేవుడా' సినిమా కూడా కొంత మేరకు పర్వాలేదనిపించింది. 'ప్రిన్స్' 'జిన్నా' 'రామ్ సేతు' సినిమాలు బాక్సాఫీస్‌ పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. అయితే దీపావళి సీజన్ లో 'బ్లాక్ ఆడమ్' అనే ఇంగ్లిష్ సినిమా మంచి వసూళ్లు రాబట్టడం గమనార్హం.

అక్టోబర్ చివరి వారంలో ఎప్పుడో చిత్రీకరణ పూర్తై థియేటర్లు దొరకని చిన్న చిత్రాలన్నీ రిలీజ్ అయ్యాయి. 'అనుకోని ప్రయాణం' 'వెల్ కమ్ టూ తీహార్ కాలేజ్' 'నిన్నే చూస్తు' 'రుద్రవీణ' 'ఫోకస్' వంటి చిన్నా చితక సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే వీటిల్లో ఏ ఒక్కటీ బాక్సాఫీస్ వద్ద నిలవలేదు.

మధ్యలో 'రెబల్' 'అడవి' వంటి రీ-రిలీజులను కూడా కలుపుకొని అక్టోబర్ లో పాతిక సినిమాలకు పైగానే విడుదల అయ్యాయి. అయితే వీటిల్లో స్ట్రెయిట్ చిత్రాల కంటే డబ్బింగ్ చిత్రాలే మంచి విజయం సాధించాయి. 'కాంతారా' 'సర్దార్' వంటి రెండు సినిమాలు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కు లాభాలు తెచ్చిపెట్టాయి.

సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలు సర్వ సాధారణమే. ఒక నెలలో రిలీజైన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటే.. మరో నెలలో వచ్చిన చిత్రాలు సినీ అభిమానులను పూర్తిగా నిరాశ పరుస్తుంటాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న అక్టోబర్ నెల నిరాశ పరిచిందనే చెప్పాలి.

అయితే ఈ నెలలో వచ్చిన కొన్ని సినిమాలు మంచి కంటెంట్ ఉన్నా కూడా సరైన ప్లానింగ్ తో రిలీజ్ చేయకపోవడం వల్ల ఫెయిల్యూర్స్ గా నిలిచిపోయాయి. దసరా - దీపావళి సీజన్లను క్యాష్ చేసుకోవాలని ఆశ పడి నష్టాలను కొని తెచ్చుకున్నారు.

అదే కొంచం క్రేజ్ ఉన్న చిత్రాలను పండగ సినిమాలతో పోటీ పడకుండా.. మిగతా వారాల్లో రిలీజ్ చేసుంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని విశ్లేషిస్తున్నారు. దీన్ని బట్టి కంటెంట్ మరియు మంచి ప్రమోషన్స్ చేయడమే కాదు.. సరైన ప్లానింగ్ తో విడుదల చేయాలని అక్టోబర్ బాక్సాఫీస్ ని బట్టి అర్థమవుతుంది. మరి ఈ నెల టాలీవుడ్ కు ఏ మేరకు కలిసొస్తుందో వేచి చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.