Begin typing your search above and press return to search.

థియేట‌ర్లో బొమ్మ ఫ్లాప్..కానీ ప్ర‌తీ ఒక్క‌రి డైరీ ఫుల్‌!

By:  Tupaki Desk   |   24 Dec 2022 7:00 AM IST
థియేట‌ర్లో బొమ్మ ఫ్లాప్..కానీ ప్ర‌తీ ఒక్క‌రి డైరీ ఫుల్‌!
X
టాలీవుడ్ లో ప్ర‌స్తుతం మునుపెన్న‌డూ లేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఓ ప‌క్క థియేట‌ర్ల‌లో ఒక‌టి రెండు సినిమాలు మాత్ర‌మే హిట్ అనిపించుకుంటున్నా ఇండ‌స్ట్రీలో వున్న ఏ ఒక్క హీరో కూడా ఖాళీగా లేడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. క‌రోనాకు ముందు టాలీవుడ్ లో వున్న ప‌రిస్థితుల‌కు.. క‌రోనా త‌రువాత‌.. ఓటీటీ ల ప్ర‌భావం భారీ స్థాయిలో పెరిగిన త‌రువాత ప‌రిస్థితుల్లో భారీ మార్పులు క‌నిపిస్తున్నాయి. అప్ప‌ట్లో పెద్ద హీరోల సినిమాల‌కు మాత్ర‌మే థియేట‌ర్లు ల‌భించేవి.

చిన్న సినిమాలు తీసిన నిర్మాత‌లు, హీరోలు త‌మ సినిమాకు థియేట‌ర్లు ఎప్పుడు ల‌భిస్తాయా? అని ఎదురు చూస్తూ వుండేవారు. పెద్ద సినిమాల వ‌ర‌ద పూర్త‌యిన త‌రువాత కానీ.. లేదంటే వారి సినిమాకు థియేట‌ర్లు ల‌భించిన సంద‌ర్భంలో కానీ త‌మ సినిమాల‌ని థియేట‌ర్లలో రిలీజ్ చేసుకునేవారు. ఇలా చేసిన సినిమాలు రిలీజ్ కోసం ఎదురుచూడాల్సి రావ‌డంతో స‌ద‌రు చిన్న స్టార్లు మ‌రో సినిమా చేయ‌డానికి అవ‌కాశం చిక్కేది కాదు. కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితులు మారాయి.

క‌రోనా కార‌ణంగా ఓటీటీల ప్ర‌భావం భారీ స్థాయిలో పెర‌గిపోవ‌డంతో థియేట‌ర్ల కోసం మేక‌ర్స్ వేచి చూడాడం లేదు. థియేట‌ర్ల కోస‌మే చిన్న సినిమాలు చేయాల‌నే ధోర‌ణిని ప‌క్క‌న పెట్టేశారు. ఓటీటీలు సై అంటే వాటి కోసం సినిమాలు, కాక‌పోతే వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. దీంతో చాలా వ‌ర‌కు యంగ్ హీరోలు ఖాళీగా వుండ‌టం లేదు. సీరియ‌ల్ న‌టులు కూడా వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తూ బిజీగా వుంటున్న నేప‌థ్యంలో చిన్న హీరోలు వ‌రుస‌గా వెబ్ సిరీస్ లు, ఓటీటీల కోసం సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా చేతినిండా సినిమాలు, సిరీస్ ల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు.

తెలిసిన ప్రొడ్యూస‌ర్ సినిమా లేదా, సిరీస్ చేద్దామ‌ని ఆర్టిస్ట్ ల కోసం సంప్ర‌దిస్తే వ‌రుస ఫ్లాపులిచ్చిన హీరో కూడా ఖాళీ లేదని, త‌న చేతిలో మూడు నాలుగు ప్రాజెక్ట్ లు వున్నాయ‌ని చెప్ప‌డంతో స‌ద‌రు నిర్మాత షాక్ కు గుర‌చ్చాడ‌ట‌.

దీంతో థియేట‌ర్లో బొమ్మ ఫ్లాప్ కానీ ప్ర‌తీ ఒక్క‌రి డైరీ ఫుల్ కావ‌డంతో కొంత మంది నిర్మాత‌లకు ఏం చేయాలో తోచ‌డం లేద‌ట‌. సినిమాని ప‌క్క‌న పెట్టి వెబ్ సిరీస్ అయినా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే ప్ర‌తీ లీడ్ యాక్ట‌ర్ నుంచి ఇలాంటి స‌మాధాన‌మే ఎదుర‌వుతుండ‌టంతో ప్ర‌స్తుత టాలీవుడ్ ప‌రిస్థితిని చూసి ప‌లువురు నిర్మాత‌లు ఓ ప‌క్క ఆనందం, మ‌రో ప‌క్క త‌మ‌కు ఆర్టిస్ట్ లు దొర‌క‌డం లేద‌ని విచారం వ్య‌క్తం చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.