Begin typing your search above and press return to search.

కోలీవుడ్ మాదిరిగా టాలీవుడ్ స్పందించడం లేదేంటి..?

By:  Tupaki Desk   |   19 May 2021 5:37 AM IST
కోలీవుడ్ మాదిరిగా టాలీవుడ్ స్పందించడం లేదేంటి..?
X
కరోనా విపత్కర పరిస్థితుల్లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూ ఒక్కడే రియల్ హీరో అని జనాలు కొనియాడుతున్నారు. అదే సమయంలో సోనూ కంటే ఆర్థికంగా బలంగా ఉన్న ఇతర స్టార్స్ - రాజకీయ నాయకులు - ధనవంతులపై విమర్శలు చేస్తున్నారు. కోవిడ్ సమయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ డిజిటల్ టీమ్స్ తో పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఇలాంటి పరిస్థితుల్లో ముందుకొచ్చి సహాయం చేయడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి పలువురు సినీ ప్రముఖులు వీలైనంత వరకు సాయం చేస్తున్నారు. కానీ సోనూ రేంజ్ లో చేయడం లేదు. అలా చేయాలంటే డబ్బు ఉంటే సరిపోదు. మంచి మనసుతో పాటుగా సమయం ఓపిక వంటివి కూడా ఉండాలి. అందుకే చాలామంది సెలబ్రిటీలు విరాళాలు ప్రకటించి ఆ విధంగా తమ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. కోలీవుడ్ ప్రముఖులందరూ తమిళనాడు ప్రభుత్వానికి డోనేషన్స్ ఇస్తున్నారు. అయితే టాలీవుడ్ లో మాత్రం ఇంకా ఎవరూ దీనికి శ్రీకారం చుట్టినట్లుగా లేదు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్స్ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటుగా ముందుకొచ్చి కరోనా బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. సినీ ఇండస్ట్రీలో సమస్యలు వస్తే ఎలా ప్రభుత్వాలని పరిష్కారం కోరుతారో.. అదే విధంగా ప్రజలు ఇబ్బందులు తీర్చే బాధ్యత కూడా తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. నిజానికి గతేడాది టాలీవుడ్ ప్రముఖులందరూ కోవిడ్ బాధితుల కోసం సినీ కార్మికుల కోసం పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. మరి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు చూసి ఎందుకో మరి ఇంకా ఎవరూ ముందుకు రాలేదు. మరి రాబోయే రోజుల్లో తమ వంతు బాధ్యతగా సహాయం చేయడానికి వస్తారేమో చూడాలి.