Begin typing your search above and press return to search.

OTT అంటే మ‌నోళ్ల‌కు అంత చిన్న చూపా?

By:  Tupaki Desk   |   22 April 2020 10:00 AM IST
OTT అంటే మ‌నోళ్ల‌కు అంత చిన్న చూపా?
X
లాక్ డౌన్ ఓటీటీ విలువను ప‌దింత‌లు పెంచింది. దాదాపు నెల రోజులుగా సినీప్రియులంతా వినోదాన్ని ఓటీటీల్లోనే వెతుక్కుంటున్నారు. ఖాళీ స‌మ‌యం చిక్క‌డంతో దొరికిన‌ ఏ సినిమానీ విడిచిపెట్ట‌డం లేదు.24 గంట‌ల్లో నాలుగైదు సినిమాలు చూసేస్తున్నారు. టాలీవుడ్ ఆడియ‌న్స్ అయితే ఓటీటీ వేదిక‌పై అందుబాటులో ఉన్న తెలుగు సినిమాల‌తో పాటు ప‌ర‌భాషా సినిమాల‌ను ఆస్వాధిస్తున్నారు. దిల్ రాజు లాంటి తెలివైన వాళ్లు పాత స్టాక్ సినిమాల‌ను అమెజాన్ కి తొసేసి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక లాక్ డౌన్ కార‌ణం గా థియేట‌ర్ రిలీజ్ కు నోచుకోని సినిమాలు ఒక‌టొక‌టిగా నేరుగా ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. ఆడియ‌న్స్ కి థియేట‌ర్లో చూసిన కిక్కు దొర‌క‌క‌ పోయినా ఫ్యామిలీ అంతా ఒకే చోట ఇంట్లో కూర్చుని చూసుకునే స‌దుపాయం ఉంది కాబ‌ట్టి బాగానే ఆద‌ర‌ణ ద‌క్కుతోంది.

ఇంట్లోనే చూస్తే బోలెడంత మిగులు అన్న సంగ‌తి అర్థం చేసుకుంటున్నారు. సినిమా టికెట్ తో పాటు స్నాక్స్ ఖ‌ర్చు త‌గ్గుతోంది. ఇదే అల‌వాటు ప‌డితే జ‌నాలు ఇక మీద‌ట‌ థియేట‌ర్ కి రావ‌డం క‌ష్ట‌మని ఇప్ప‌టికే నిపుణుల విశ్లేషిస్తున్నారు. అయితే ఓటీటీ పై ఎవ‌రి అభిప్రాయం ఎలా ఉన్నా..కొంత మంది హీరోల‌కి కాస్త చిన్న చూపు ఉన్న‌ట్లు తాజా సీన్ చెబుతోంది. రామ్- రాజ్ త‌రుణ్- అనుష్క- నానీ- సుధీర్ బాబు- ప్ర‌దీప్ మాచిరాజు స‌హా ప‌లువురు హీరోలు ఓటీటీ రిలీజ్ పేరెత్తితేనే తీవ్ర అసంతృప్తిగా ఉన్నార‌ని తెలుస్తోంది. నానీ న‌టించిన వీ.. రామ్ న‌టించిన రెడ్.. రాజ్ త‌రుణ్ న‌టించిన ఒరేయ్ బుజ్జిగా.. అనుష్క న‌టించిన నిశ్శ‌బ్ధం .. షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతున్న స‌మ‌యంలో లాక్ డౌన్ విధించారు. దీంతో ఈ సినిమా రిలీజ్ ల‌న్నీ వాయిదా ప‌డ్డాయి.

తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌ట్లో థియేటర్లు రీ ఓపెన్ చేసే సీన్ క‌నిపించ‌డం లేదు. రిలీజ్ ల‌కు ఓటీటీ ఒక్క‌టే ఆప్ష‌న్ గా క‌నిపిస్తోంది. అయితే దానికి మాత్రం హీరోలంతా స‌సేమిరా అనేస్తున్నారు. ఓటీటీ ద్వారా మా సినిమాలు ఎందుకు రిలీజ్ చేస్తాం? అన్న‌ట్లు సామాజిక మాధ్య‌మాల్లో మాట్లాడుతున్నారు. రామ్ త‌న రెడ్ చిత్రాన్ని ఎంత ఆల‌స్య‌మైనా స‌రే థియేట‌ర్ లోకే తీసుకొస్తాం త‌ప్ప ముందుగా ఓటీటీ లో రిలీజ్ చేయ‌మ‌ని తెగేసి చెప్పేసాడు. రాజ్ త‌రుణ్ కూడా త‌న చిత్రాన్ని ఎట్టి ప‌రిస్థితిలో ముందుగా ఓటీటీలో రిలీజ్ చేయ‌మ‌న్నాడు. ఇక అనుష్క నిశ‌బ్ధం చిత్రాన్ని ఎంతో క‌ష్ట‌ప‌డి చేసాం. ఓటీటీ లో రిలీజ్ చేసుకోవ‌డానికా? అన్న‌ట్లు కాస్త సీరియ‌స్ గానే రియాక్ట్ అయ్యారు నిర్మాత‌లు. లాక్ డౌన్ పోవాలి...థియేట‌ర్లు ఓపెన్ చేయాలి. మా సినిమాలు రిలీజ్ అవ్వాలి!! అన్నట్లే మాట్లాడారు. అయితే క‌రోనాకి వ్యాక్సినేష‌న్ రావాలి. వ‌చ్చాకే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తారు కాబ‌ట్టి అప్ప‌టివర‌కూ వీళ్లు వేచి చూస్తారా? అంటూ కొంద‌రు సందిగ్ధ‌త వ్య‌క్తం చేస్తున్నారు. క‌ల్లోలంలో నిర్మాత క‌ష్టం చూడ‌రా? అంటూ చుర‌క‌లు వేస్తున్నారు. ఈ క‌ష్ట‌కాలంలో వెయిటింగ్ స‌రైన‌దేనా? ఓటీటీకి వెళితే నామోషీనా? అన్న‌ది వాళ్లే నిర్ణ‌యించుకోవాల్సి ఉంటుంది. వెండితెర రిలీజ్ కి ఉండే క్రేజు ఓటీటీకి ఉండ‌క‌పోయినా.. క‌నీసం సినిమా జ‌నాల‌కు చేరుతుంది! అన్న ఇంగితం కూడా ఉండ‌దా? అనే వాళ్లు ఉన్నారు. ఇంకా ఎన్నాళ్లు వెయిట్ చేస్తారో చూడాలి. అయినా ఓటీటీ పై వీళ్లంద‌రికి ఎందుకంత చిన్న చూపో తేలాలి.