Begin typing your search above and press return to search.

జులై జెండా ఎవరిది?

By:  Tupaki Desk   |   2 July 2018 7:33 AM GMT
జులై జెండా ఎవరిది?
X
టాలీవుడ్ లో ఈ జులై యూత్ హీరోల మధ్య రసవత్తరమైన పోటీకి వేదికగా మారబోతోంది. భారీ ఓపెనింగ్స్ తెచ్చే స్టార్ హీరో సినిమా వీటిలో ఏది లేకపోయినప్పటికీ దేని క్రేజ్ దానికి ఉండటం విశేషం. స్కూల్స్ రీ ఓపెన్ కావడంతో పాటు సెలవుల సందడి పూర్తిగా ముగిసిపోవడంతో థియేటర్ల దగ్గర జనం హడావిడి అంతగా లేదు. ఈ నేపధ్యంలో బలమైన సాలిడ్ కంటెంట్ ఉంటే తప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా నిలిచే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న హీరోలు టెన్షన్ తో టైం గడుపుతున్నారు.

గోపిచంద్ పంతం ఈ సిరీస్ లో ముందుగా రాబోతున్న సినిమా. 5న రానున్న పంతం తాలూకు ట్రైలర్ ప్లస్ ఆడియో మరీ గొప్పగా లేకపోయినా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా మాస్ ని మెప్పించే అవకాశాల మీద గోపీచంద్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. గత ఏడాది రెండు సినిమాలు డిజాస్టర్ కావడంతో పాటు ఆరడుగుల బులెట్ విడుదలే కాలేదు. కొత్త దర్శకుడు చక్రవర్తి పంతంని ఎలా డీల్ చేసుంటాడా అనే ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇదే ట్రాక్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్ సైతం తేజ్ ఐ లవ్ యు కోసం ఇంత కన్నా ఎక్కువగా వర్రీ అవుతున్నాడు. మెగా రేస్ లో బాగా వెనుకుబడిన తేజుకి దీని సక్సెస్ చాలా కీలకం.

ఇక కార్తీ హీరోగా వస్తున్న చినబాబు డబ్బింగ్ వెర్షన్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. స్వచ్ఛమైన పల్లె వాతావరణంలో రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలు లేవు కానీ ఖాకీ ఇచ్చిన ఓ మాదిరి సక్సెస్ కార్తీలో నమ్మకాన్ని పెంచింది. రంగస్థలం సక్సెస్ కూడా గ్రామీణ నేపధ్యంలో తీసిన చినబాబుకి సాఫ్ట్ కార్నర్ వచ్చేలా చేస్తోంది. రాజ్ తరుణ్ లవర్ కూడా లైన్ రెడీ చేసుకున్నాడు. గత రెండేళ్లలో దేనికీ రాని పాజిటివ్ టాక్ లవర్ ఆడియోకు రావడం ఊరటనిచ్చే విషయం. దిల్ రాజు నిర్మాణం కనక మార్కెటింగ్ బాగానే జరుగుతోంది కానీ సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న లవర్ తనకు ఇప్పుడు చాలా కీలకం

ఇక తన స్థాయిని మించి ఎన్నో రేట్లు అధిక బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాక్ష్యం కూడా ముస్తాబవుతోంది. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో పంచభూతాల కాన్సెప్ట్ తో శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన సాక్ష్యం సీజే వర్క్ వల్ల డిలే అవుతూ వస్తోంది. ఇది కూడా సాయి శ్రీనివాస్ కు ఇది లైఫ్ అండ్ డెత్ ఛాలెంజ్. పేరున్న దర్శకులతో భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాలు చేసినా ఆశించిన ఫలితం దక్కించుకోలేకపోతున్న సాయి శ్రీనివాస్ కు సాక్ష్యం ఫలితం చాలా కీలకం

ఇవి కాకుండా కళ్యాణ్ దేవ్ విజేత నీహారిక హ్యాపీ వెడ్డింగ్ కూడా లైన్ లో ఉన్నాయి. మొత్తానికి మీడియం రేంజ్ నుంచి చిన్న హీరోల వరకు జులైని వేదికగా మార్చుకుని పెద్ద సమరానికి తెరతీస్తున్నారు. ఇవి కాకుండా నెల పూర్తయ్యే లోపు ఈ రోలో మరో మూడు నాలుగు సినిమాలు తోడయ్యే ఛాన్స్ కూడా ఉంది. బట్ గెలుపు ఎవరిది అనేదే ఆసక్తికరంగా మారింది.