Begin typing your search above and press return to search.

రాజ్ తరుణే కింగ్

By:  Tupaki Desk   |   28 Jan 2016 9:31 AM GMT
రాజ్ తరుణే కింగ్
X
మొత్తానికి సంక్రాంతి సినిమాలు రెండు వారాల పాటు బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి చేశాయి. ఇవి బాగానే ఆడుతుండటంతో సంక్రాంతి తర్వాత రెండో వారం ఇంకో సినిమా ఏదీ కూడా విడుదల కాలేదు. ఇక ఈ వారం ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలైతే.. ఇంకో రెండు డబ్బింగ్ మూవీస్. అన్నింట్లోకి రాజ్ తరుణ్ సినిమా ‘సీతమ్మ అందాలు.. రామయ్యా సిత్రాలు’నే మంచి క్రేజ్ మధ్య రిలీజ్ అవుతుంది. ముందు ఈ టైటిల్ అదీ చూసి జనాలకు అంత ఆసక్తి ఏమీ కలగలేదు ఈ సినిమాపై. ఐతే టీజర్ - ట్రైలర్ చూశాక ఇంప్రెషన్ మారిపోయింది. ఇప్పటికే వరుసగా మూడు హిట్లు కొట్టిన రాజ్.. ఈసారి డబుల్ హ్యాట్రిక్‌ కు శ్రీకారం చుట్టేలా కనిపిస్తున్నాడు. ఈ వారం అత్యధిక థియేటర్లలో రిలీజవుతున్న సినిమా కూడా ఇదే.

ఇక ‘అందాల రాక్షసి’ జంట నవీన్ చంద్ర - లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ కూడా ఓ మోస్తరుగా ఆసక్తి రేపుతోంది. రాజమౌళి శిష్యుడు జగదీష్ తలసిల ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. ఐతే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ మాత్రమే లావణ్యనే. భలే భలే మగాడివోయ్ - సోగ్గాడే చిన్నినాయనా లాంటి హిట్లతో ఊపుమీదుంది లావణ్య. ఇక ఈ వారం రాబోయే మిగతా రెండు డబ్బింగ్ సినిమాల్లో ‘కళావతి’కి మంచి క్రేజుంది. ఈ సినిమాకు తెలుగులోనూ భారీగా పబ్లిసిటీ చేసి జనాల్లో ఆసక్తి పుట్టించారు. ‘కళావతి’ తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ శుక్రవారమే రిలీజవుతోంది. ఇక రెండో డబ్బింగ్ మూవీ ‘నేనూ రౌడీనే’ తమిళంలో మూడు నెలల కిందట రిలీజై పెద్ద హిట్టయింది. కానీ తెలుగులో పెద్దగా పబ్లిసిటీ చేయకుండా రిలీజ్ చేసేస్తున్నారు. విజయ్ సేతుపతి - నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని పెద్దగా ఆకర్షిస్తున్నట్లు లేదు.