Begin typing your search above and press return to search.

ఓటీటీలలో చిన్న సినిమాలు.. బాగుంటేనే చూసేది!

By:  Tupaki Desk   |   1 May 2020 5:40 PM IST
ఓటీటీలలో చిన్న సినిమాలు.. బాగుంటేనే చూసేది!
X
ఈ ప్రపంచంలో శాశ్వతమైన విషయం ఒకటేనట. అదే 'మార్పు'. ఈ విషయం ఎంతో మంది మహానుభావులు ఇప్పటికే చెప్పారు. అయితే మార్పును స్వీకరించడం అందరివల్లా కాదు. దానికి తగ్గట్టుగా మారడం కూడా అందరివల్లా కాదు. అయితే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మార్పులు రావడం తథ్యం. ప్రస్తుతం మిగతా అన్ని రంగాలతో పాటుగా సిని రంగంకూడా ఓ కుదుపుకు గురయింది. మార్పు రాబోతుందని అందరికీ అర్థం అవుతోంది. అయితే చాలామంది ఈ మార్పుకు రెడీగా లేరన్న విషయంకూడా అర్థం అవుతోంది.

అన్నిటికంటే ముఖ్యంగా థియేటర్ల విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. మరోవైపు ఇంట్లోనే ఉన్న జనాలు ఓటీటీలకు అలవాటు పడుతున్నారు. ఓటీటీలేమో తమ సబ్ స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంటూ సినిమా ఎగ్జిబిషన్ రంగానికి గట్టి సవాలు విసురుతున్నాయి. దీంతో థియేట్రికల్ రిలీజ్ కు బదులుగా ఓటీటీ రిలీజ్ కు సంబందించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. పెద్ద సినిమాలకు పెట్టుబడి ఎలా రికవరీ అవుతుంది? ఓటీటీలు నిజంగా వందల కోట్లు ఖర్చు పెట్టి రైట్స్ కొంటాయా అనేది సందేహమే. పెట్టుబడి అంతా ఓటీటీల నుంచి తిరిగి రాబట్టుకోవడం ప్రస్తుతానికి కష్టమే కానీ భవిష్యత్తులో మాత్రం వీలవుతుందని అంటున్నారు. ఒటీటీలకు తగ్గట్టుగా బడ్జెట్లను తగ్గించుకుంటే.. అనవసరమైన ఖర్చు తగ్గించుకుంటే అది సాధ్యమని అంటున్నారు. ఇవన్నీ పెద్ద సినిమాల విషయాలు.

ఇక చిన్న సినిమాల గురించి మాట్లాడుకుంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో తప్ప అవుట్ రైట్ గా ఓటీటీలు సినిమాల రైట్స్ కొనరు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఎక్కువ సినిమాలు రొటీన్ గా ఉంటాయి. రెండోది.. ప్రేక్షకులు కూడా స్టార్ హీరోనో.. స్టార్ డైరెక్టరో లేదా ఎవరైనా తెలిసిన వారు ఉన్న సినిమాలను చూస్తారు కానీ చిన్న సినిమాలను ఎగబడి చూసే పరిస్థితి ఉండదు. అందుకే ఇప్పుడు చిన్న సినిమాలకు పే పర్ అవర్(PPH) అనే మోడల్ తో ఓటీటీ వారు ముందుకొస్తున్నారు. ఒక ఉదాహరణ తీసుకుంటే ఈ మోడల్ ప్రకారం వ్యూస్ ను బట్టే ఫిలిం మేకర్లకు ఆదాయం ఉంటుంది.

ఒక ఉదాహరణ తీసుకుంటే ఓ ఇదు కోట్ల బడ్జెట్ రికవరీకి ఒటీటీ ప్లాట్ ఫామ్ లో కనీసం 40 లక్షల వ్యూస్ రావాల్సి ఉంటుంది. అయితే సినిమా బాగుందని రివ్యూలు వస్తే.. మంచి టాక్ ఉంటే ఆ వ్యూస్ దక్కించుకోవడం సమస్య కాదు కానీ సినిమాలో స్టఫ్ లేకపోతే పది లక్షల వ్యూస్ కోసం కూడా ముక్కి మూలగాల్సి ఉంటుంది. జనాలు ఒటీటీలు చూడాడానికి ఎగబడుతున్నారు అనేది వాస్తవమే కానీ ముష్టి సినిమాలను చూడడానికి వారికేమీ ఆసక్తి ఉండదు. పైగా ఇది టీవీ ఛానెల్స్ తరహా కాదు. పాజ్ బటన్.. డ్రాగ్ బటన్స్ ఉంటాయి. రెండున్నర గంట సినిమాను పది నిముషాల్లో పూర్తి చేసి మరో సినిమాకు వెళ్ళిపోతారు. లేదా అసలు ఆ సినిమాను ఓపెన్ కూడా చెయ్యరు. అంటే ఇక్కడ కూడా కంటెంట్ కే పెద్ద పీట. సినిమా బాగుంటే భాషతో సంబంధం లేకుండా పెద్ద హిట్ అవుతుంది. లేకపోతే ఎవరూ చూడరు. దీనర్థం.. చిన్న సినిమాల మేకర్లుకూడా మంచి కంటెంట్ తో వస్తేనే విజయం.. లేకపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు.