Begin typing your search above and press return to search.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: అప్రూవర్‌ గా మారిన డ్రగ్ పెడ్లర్..

By:  Tupaki Desk   |   1 Sept 2021 3:00 PM IST
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: అప్రూవర్‌ గా మారిన డ్రగ్ పెడ్లర్..
X
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నాలుగేళ్ళ క్రితం నాటి ఈ కేసులో ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తున్న నేపథ్యంలో.. నిందితుడుగా ఉన్న డ్రగ్ పెడ్లర్ కెల్విన్‌ ఈడీ అధికారుల ముందు లొంగిపోయాడు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్ల ఆధారంగా ఈడీ అధికారులు కెల్విన్ పై కేసు నమోదు చేయగా.. తాజాగా అతను అప్రూవర్‌ గా మారిపోయాడని తెలుస్తోంది

కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకే టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేసినట్లు సమాచారం. కెల్విన్‌ బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్న ఈడీ అధికారులు.. అతని అకౌంట్ లోకి సినీ ప్రముఖుల నుంచి డబ్బులు జమ అయిందేమో అని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలకు పంపిన నోటీసులలో 2015 నుండి తమ బ్యాంకు ఖాతాల వివరాలను కోరినట్లు తెలుస్తోంది.

మంగళవారం ఆగస్టు 31న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పూరీ గత ఆరేళ్ళ తన బ్యాంకు స్టేట్మెంట్స్ ను ఈడీ అధికారులకు సమర్పించారు. దాదాపు 11 గంటల పాటు పూరీ జగన్నాథ్ ను ఈడీ ప్రశ్నించింది. రాబోయే రోజుల్లో మిగతా 11మందిని విచారించనున్నారు. వీరందరినీ మనీలాండరింగ్ చట్టం కింద కేవలం సాక్షులుగానే ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే సెప్టెంబర్‌ 2న చార్మీ - 6న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ - 8న రానా దగ్గుబాటి - 9న రవితేజ మరియు అతని డ్రైవర్‌ శ్రీనివాస్‌ లను ఈడీ విచారించనుంది. ఇదే క్రమంలో సెప్టెంబర్‌ 13న నవదీప్‌ మరియు ఎఫ్‌ క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ - 15న ముమైత్ ఖాన్‌ - 17న తనీష్‌ - 20న నందు - 22న తరుణ్‌ ఈడీ ఎదుట హాజరుకానున్నారు.