Begin typing your search above and press return to search.

మళ్ళీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. 11 మందికి క్లీన్ చిట్..!

By:  Tupaki Desk   |   1 July 2021 9:00 PM IST
మళ్ళీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. 11 మందికి క్లీన్ చిట్..!
X
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన 2017 డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. మాదకద్రవ్యాల కేసులో అప్పట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిట్ దాఖలు చేసిన 12 చార్జ్ షీట్లకు నాలుగేళ్ల తర్వాత న్యాయస్థానం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు 2017 జులై 2న డ్రగ్స్ కేసు నమోదు చేశారు. టాలీవుడ్ లోని అనేక మంది ప్ర‌ముఖులు డ్ర‌గ్స్ యూజర్స్ గా ఉన్నారని.. డ్ర‌గ్స్ డీల‌ర్లతో సంబంధాలు ఉన్నాయడానికి ఆధారాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ వ్యవహారంపై ఎక్సైజ్ చీఫ్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి పలువురు సెలబ్రిటీలతో పాటుగా సాఫ్టువేర్ ఇంజినీర్స్ - వ్యాపారస్తులను విచారించారు.

డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ పోలీసులు మొత్తం 12 కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో 30 మందిని అరెస్ట్ చేసి 27 మందిని విచారించినట్లు ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఛార్జిషీట్ లో తెలిపారు. ముందు 8 కేసుల్లో మాత్రమే అధికారులు ఛార్జిషీట్ ఫైల్ చేయగా.. ఎక్సైజ్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు రావడంతో మరో నాలుగు ఛార్జిషీట్లు దాఖలు చేశారు.

టాలీవుడ్ కు చెందిన నటీనటులు దర్శకులు ఈ విచారణకు హాజరవడంతో.. అప్పట్లో డ్రగ్స్ వ్యవహారం నిత్యం వార్తల్లో నిలిచింది. సెలబ్రిటీలపై అనేక క‌థ‌నాలు వ‌చ్చాయి. డ్ర‌గ్స్ వినియోగించారని.. డ్ర‌గ్స్ సరఫరా చేసారని అన్నారు. అయితే ఈ కేసులో సినీ ప్రముఖులనెవరినీ పోలీసులు అరెస్టు చేయ‌లేదు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన ఈ కేసు.. ఇప్పుడు కోర్టు ఆమోదంతో మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఈ క్రమంలో 11 మందికి క్లీన్ చిట్ లభించినట్లు తెలుస్తోంది.