Begin typing your search above and press return to search.

బాలీవుడ్ బాట పడుతున్న టాలీవుడ్ దర్శకులు..!

By:  Tupaki Desk   |   22 Dec 2020 4:30 PM GMT
బాలీవుడ్ బాట పడుతున్న టాలీవుడ్ దర్శకులు..!
X
భారతీయ చిత్ర పరిశ్రమలో అతి పెద్ద ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన బాలీవుడ్.. మొదటి నుంచి కూడా టాలీవుడ్ పై ఫోకస్ పెడుతూ వచ్చింది. తెలుగులో సక్సెస్ అయిన దర్శకులతో హిందీలో సినిమాలు చేయడానికి బాలీవుడ్ స్టార్స్ మరియు ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. అప్పట్లో ఆదుర్తి సుబ్బారావు - కె. బాపయ్య - బాపు - దాసరి నారాయణరావు - కె. రాఘవేంద్రరావు - కె. విశ్వనాథ్ - ఈవీవీ సత్యనారాయణ - రవిరాజా పినిశెట్టి వంటి ప్రముఖ దర్శకులు హిందీలో సినిమాలు చేశారు. ఆ తర్వాత రోజుల్లో రామ్ గోపాల్ వర్మ - తేజ - విజయ్ భాస్కర్ - కృష్ణవంశీ - పూరీ జగన్నాథ్ - రాజ్ - డీకే - దేవకట్టా - క్రిష్ జాగర్లమూడి వంటి డైరెక్టర్స్ బాలీవుడ్ లో అడుగుపెట్టారు. వీరిలో ఆర్జీవీ - పూరీ - రాజ్ డీకే ఇప్పటికీ హిందీ సినిమాలు చేస్తూనే ఉన్నారు.

ఇక 'అర్జున్ రెడ్డి' సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా.. అదే సినిమాని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ సినిమాని రణబీర్ కపూర్ తో చేయనున్నాడని తెలుస్తోంది. దీనికి 'యానిమల్' అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. అలానే 'ఘాజీ' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న సంకల్ప్ రెడ్డి.. విద్యుత్ జమాల్ హీరోగా స్ట్రయిట్ హిందీ మూవీ చేస్తున్నాడు. గతేడాది 'జెర్సీ' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న గౌత‌మ్ తిన్ననూరి.. అదే సినిమాని షాహిద్ కపూర్ తో హిందీలో రీమేక్ చేస్తున్నాడు.

ఇప్పుడు లేటెస్టుగా బీ టౌన్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం యువ దర్శకుడు సుజీత్ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ఓ సినిమా చేయనున్నాడట. సుజీత్ ఇంతకముందు 'సాహో' సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన సుజీత్.. ఇటీవలే విక్కీ కౌషల్ కి స్క్రిప్ట్ నెరేట్ చేసాడట. అనుకోని కారణాల వల్ల మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ లతో సినిమాలు మిస్ చేసుకున్న సుజీత్ ఇప్పుడు తన స్టోరీతో విక్కీ ని మెప్పించాడని అంటున్నారు. ఏదేమైనా టాలీవుడ్ లో నిరూపించుకున్న డైరెక్టర్స్ ని ఆహ్వానించడాని బాలీవుడ్ ఎప్పుడూ గేట్లు తెరిచే ఉంటుందని చెప్పవచ్చు.