Begin typing your search above and press return to search.

అబ్బా.. ఈ సృష్టికర్త ఎవరబ్బా?

By:  Tupaki Desk   |   5 May 2016 11:00 PM IST
అబ్బా.. ఈ సృష్టికర్త ఎవరబ్బా?
X
రేసుగుర్రం సినిమాలో ''దే..వు..డా'' అనే ప్రయోగం చేయగానే.. ఆ పదం ఊర ఫేమస్‌ అయిపోయింది. అందరూ అదే స్లాంగ్ తో ఆ పదాన్ని మిమిక్‌ చేయడం మొదలెట్టారు. గతంలో ఇదే విధంగా.. ''ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకో'' ''వారినీ తస్సారవలా బడ్డూ'' మొదలగు లైన్లు.. అలాగే ఆ ఒక్కటీ అడక్కు వంటి సినిమాలోని అనేక లైన్లు.. జనాలు చాలా సంవత్సరాలపాటు వాడేశారు. ఇప్పుడు అలాగే మరో కొత్త పదం తెగ వినబడుతోంది.

''అబ్బా ఆ హీరో అదరగొట్టాడబ్బా..'' ''ఇది కాస్త ఓవరబ్బా..'' ''వాళ్ళు సూపరబ్బా..'' ''ఏయ్‌.. నాకు నచ్చలేదబ్బా'' ఇలా మాటకు చివరకు అబ్బా అంటూ స్వీట్‌ గా సాగదీసే కల్చర్‌ కొత్తగా వచ్చింది. ఎక్కువ మంది యువత ఇదే ఊత పదంగా డెవలప్‌ చేసుకొని తెగ వాడేస్తున్నారు. అయితే ఈ పదం అంతగా ఫేమస్‌ అవ్వడానికి అసలు ఏ సినిమాలో వచ్చింది మరి? నిజానికి ఈసారి సినిమా ఎఫెక్టు కాదండోయ్‌. ఇది టివి ఛానల్స్‌ ఎఫెక్టు. ముఖ్యంగా పాపులర్ యాంకర్లయిన లాస్య వంటి వారు.. ఇలా చాలా మాటలకు చివర '+అబ్బా' అనేది ఒక సంధి ప్రయోగంలా కలుపుకుంటూ పోతున్నారు. అదే లాంగ్వేజ్‌ ను యువత కాపీ కొట్టుకొని తెగ వాడేసుకుంటోంది. ఆ విధంగా ఈ 'అబ్బా' సృష్టికర్తలు తెలుగు ఛానల్స్‌ లో లేలేతగా మాట్లాడే కొందరు యాంకర్లు అని చెప్పొచ్చు.

దే..వు..డా అనే ట్రెండ్‌ కొనసాగతున్నప్పుడు.. ఈ అబ్బా ట్రెండ్‌ తెచ్చారు మనోళ్ళు. మరి ముందుముందు ఇంకెన్ని కొత్త రకమైన పద అల్లికలతో.. వాటి ఉచ్ఛారణతో మనకు పిచ్చెక్కిస్తారనే విషయం.. కాలమే తేలుస్తుంది. సారీ.. కాలమే తేలుస్తుందబ్బా!!