Begin typing your search above and press return to search.

రేపటి మీటింగులో తాడో పేడో తేలుస్తార‌ట‌

By:  Tupaki Desk   |   14 May 2020 9:45 AM IST
రేపటి మీటింగులో తాడో పేడో తేలుస్తార‌ట‌
X
40 రోజుల లాక్ డౌన్ పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుత‌లం చేసింది. కార్మికుల్ని రోడ్డు‌న ప‌డేలా చేసింది. బ‌తుకు తెరువు లేక తిండికి లేక న‌క‌న‌క‌లాడే పరిస్థితి త‌లెత్తింది. ముఖ్యంగా అసంఘ‌టిత రంగం అయిన వినోద ప‌రిశ్ర‌మ‌ టోట‌ల్ గా కుదేలైంది. నిర్మాత.. కార్మికుడు అనే తేడా లేకుండా అంద‌రిపైనా పంచ్ ప‌డిపోయింది. షూటింగుల్లేక రిలీజ్ లు లేక ప‌రిశ్ర‌మ తీవ్ర న‌ష్టాల్లో కూరుకు పోయింది. అయితే ఈ స‌న్నివేశం నుంచి బ‌య‌ట‌ ప‌డేందుకు ఇటీవ‌ల తెలంగాణ‌ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ తో బుల్లితెర పెద్ద తెర త‌ర‌పున పెద్ద మ‌నుషులు భేటీ అయిన సంగ‌తి తెలిసిందే.

అయితే మే 17 వ‌ర‌కూ లాక్ డౌన్ ని పొడిగిస్తూ కేసీఆర్ ప్ర‌భుత్వం స్ట్రిక్టుగా ఉండ‌డంతో హైదరాబాద్ ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి క‌ద‌లికా లేదు. అయితే వీట‌న్నిటికీ ప‌రిష్కారం ఎలా? అంటే రేపు(మే 15న‌) మీటింగ్ తో తాడే పేడో తేల్చేయ‌నున్నార‌ట‌. షూటింగ్స్ స‌హా థియేటర్లను తిరిగి ప్రారంభించేది ఎపుడు? అన్న‌దానిపై రేపు ఓ క్లారిటీకి రానున్నార‌ట‌. అగ్ర నిర్మాత‌లు స‌హా ప‌లువురు ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు ఈ మీటింగుకి హాజ‌ర‌వుతున్నారు.

ఈ కీల‌క భేటీలో స్టార్ల పారితోషికాలు స‌హా చాలా చాలా విష‌యాల‌పై క్లారిటీ రానుంద‌ని.. నిర్మాత‌ను బ‌తికించే ప్ర‌తి అంశంపైనా విస్త్ర‌త‌ చ‌ర్చ సాగ‌నుంద‌ని చెబుతున్నారు. అలాగే జూన్ నుంచి షూటింగులు ప్రారంభించేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవ‌డ‌మే కాదు.. తిరిగి రిలీజ్ ల‌న్నీ ఎలా సాగాలి? అన్న‌దానిపైనా ఈ భేటీలో చ‌ర్చ సాగనుంద‌ట‌. ముఖ్యంగా చిత్రీక‌ర‌ణ‌ల ముగింపులో ఉన్న సినిమాల‌పై ఒక నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే న‌టీన‌టులు .. సాంకేతిక నిపుణులందరూ కొత్త చిత్రాలకు సంతకం చేయడానికి లేదా ప్రారంభించడానికి ముందు పెండింగులో ఉన్న‌ వాటిని పూర్తి చేయాల్సిందే. వీటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జూన్ లో వెంటనే తిరిగి ప్రారంభమవుతాయి. నిర్మాతలను కాపాడటానికి వేతనాల్లో కోతపైనా చర్చ జరుగుతుంది. పెద్ద పారితోషికాల కోత‌పై నిర్మాత‌ల మండ‌లిలోనూ ఇప్ప‌టికే చ‌ర్చ సాగుతోంది. దీనిపైనా శుక్ర‌వారం నాటి మీటింగులో ప్ర‌స్థావ‌న ఉంటుంది. అగ్ర న‌టులు.. స్టార్ డైరెక్ట‌ర్స్ పారితోషికాల్లో స‌వ‌రింపు ఉంటుంద‌ని చెబుతున్నారు. అలాగే సెట్స్ లో ఎలా వ్య‌వ‌హరించాలి? సామాజిక దూరం పాటించ‌డం స‌హా సెట్స్ లో కీల‌కంగా చేయాల్సిన ఏర్పాట్ల‌పైనా చ‌ర్చ సాగనుందిట‌.