Begin typing your search above and press return to search.

థియేటర్స్ సార్.. థియేటర్స్ అంతే..!

By:  Tupaki Desk   |   5 Aug 2022 7:38 AM GMT
థియేటర్స్ సార్.. థియేటర్స్ అంతే..!
X
కరోనా పాండమిక్ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ కుదేలైపోయింది. థియేటర్స్ మూతబడిపోవడంతో.. నష్టాల నుంచి బయటపడటానికి మేకర్స్ అందరూ ఓటీటీలను ఆశ్రయించారు. డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేయడం.. నెల తిరక్కుండానే డిజిటల్ స్ట్రీమింగ్ కు పెడుతూ పెట్టుబడి వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు వరంగా కనిపించిన ఓటీటీలే.. ఇప్పుడు నిర్మాతలకు శాపంగా మారాయి.

ఓటీటీ వేదికలకు అలవాటు పడిపోయిన ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. అధిక టికెట్ ధరలు కూడా జనాలను సినిమా హాళ్లకు దూరం చేశాయని చెప్పాలి. దీంతో మొత్తం థియేట్రికల్ వ్యవస్థ పై గట్టి దెబ్బపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో RRR - సర్కారు వారి పాట - మేజర్ - విక్రమ్ వంటి కొన్ని సినిమాలను మాత్రమే థియేటర్లలో చూడటానికి ఆడియన్స్ ఆసక్తి కనబరిచారు.

వారానికో కొత్త సినిమా వస్తూనే ఉంది కానీ.. జనాలు థియేటర్లకు మాత్రం రావడం లేదు. దీంతో ఒకప్పుడు వందల కోట్ల వసూళ్లతో కళకళలాడిన టాలీవుడ్ బాక్సాఫీస్ ఇప్పుడు వెలవెలబోతోంది. నిర్మాతలు షూటింగ్స్ ఆపేసి మరీ మీటింగ్స్ పెడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. ఏదేమైనా తమవైపు నుంచి జరుగుతున్న తప్పుల్ని సరిదిద్దే దిశగా మేకర్స్ అడుగులు వేస్తున్నారు.

సినిమాలను ఓటీటీలలో చూసేందుకు మొగ్గుచూపుతున్న సినీ ప్రేక్షకులను.. తిరిగి థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. టికెట్ రేట్లు తగ్గించడమే కాదు.. సరసమైన ధరలకే సినీ వినోదం అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. సినిమాని థియేటర్లలోనే చూడమని ప్రేక్షకులను కోరుతున్నారు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ సైతం థియేటర్ ను గుడితో పోల్చి.. ఇండస్ట్రీ మనుగడకు జనాలు సహకారం ఎంతో అవసరమని తెలియజెప్పారు.

ఈరోజు 'సీతా రామం' సినిమా విడుదల నేపథ్యంలో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడానికి స్పెషల్ వీడియోతో వచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. థియేటర్లో సినిమా చూడ్డానికి ఓటీటీలో వీక్షించడానికి ఎంత తేడా ఉందో ప్రేక్షకుల అభిప్రాయాలను ఇందులో చూపించారు. ఎన్ని ఓటీటీలు వచ్చినా.. థియేటర్లో సినిమా చూడాలని.. నచ్చితే మరోసారి ఓటీటీలో చూడాలని చెప్పడాన్ని మనం చూడొచ్చు.

అలానే దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు పెరిగినట్లే.. సినిమా టికెట్ ధరలు కూడా పెరిగాయని కొందరు ప్రేక్షకులు చెప్పడం గమనార్హం. సినిమా చూడటానికి ఎన్ని వేదికలు ఉన్నా.. థియేటర్ లో సినిమా చూస్తేనే అసలు మజా అని.. ఆ అనుభూతి ఇంట్లో ఓటీటీలో చూస్తే దొరకదని పేర్కొంటున్నారు.

అదృష్టవశాత్తూ ఈరోజు థియేటర్లలోకి వచ్చిన 'బింబిసార' 'సీతా రామం' వంటి రెండు సినిమాలు కూడా పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేశాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత గొప్పగా లేకపోయినా.. రెండింటికీ హిట్ టాక్ వచ్చింది కాబట్టి.. జనాలు థియేటర్ల వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కావాలని ఆశిద్దాం.