Begin typing your search above and press return to search.

సినిమాలకు ఊరట కలిగించే విషయం చెప్పిన సెన్సార్ బోర్డ్...!

By:  Tupaki Desk   |   14 May 2020 3:20 PM IST
సినిమాలకు ఊరట కలిగించే విషయం చెప్పిన సెన్సార్ బోర్డ్...!
X
కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. కరోనా ఎఫెక్ట్ నుండి సినీ ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. లాక్ డౌన్ కారణంగా షూటింగులు ఆగిపోయి.. అన్ని సినిమాల విడుదలలు.. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా నిలిచిపోయాయి. ఇలా మొత్తం చిత్ర పరిశ్రమ మూత పడడంతో నిర్మాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మాములుగా సినిమా అనేది కొన్ని కోట్లతో కూడుకున్న వ్యవహారం. దీని కోసం వీరు ఫైనాన్సియర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇప్పుడు ఫైనాన్సర్స్ దగ్గర వడ్డీలకు డబ్బులు తెచ్చి సినిమాలను నిర్మించిన నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. ముఖ్యంగా ఈ లాక్‌ డౌన్ కారణంగా చిన్న సినిమా నిర్మాతలు ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో వారు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలలో అయినా వారి సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో వారంతా తమ చిత్రాలకు సెన్సార్ చేయాలని సెన్సార్ బోర్డుని కోరుతున్నారు. అయితే ఈ విషయంపై హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు స్పందించింది. లాక్ డౌన్ తో కుంగిపోయిన సినిమాకు కాస్త ఉప‌శ‌మ‌నం కలిగించే విషయం చెప్పింది. ఆన్ లైన్‌లో సెన్సార్ చేసుకోవ‌డానికి అనుమ‌తులు ఇచ్చింది. దీంతో చిన్న నిర్మాతలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది.

సెన్సార్ బోర్డ్ ఈ మేరకు ప్రాథమికంగా రెండు అంశాలపై నిర్మాతలకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ అధికారి వి. బాలకృష్ణ వెల్లడించారు. లాక్‌ డౌన్ వల్ల నిర్మాతలకు ఎక్కువ నష్టం వాటిల్లుతోందని.. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధ్యమైనంత త్వరగా సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలని నిర్ణయించామని తెలియజేసారు. ఇది వ‌ర‌కు సినిమా సెన్సార్ కోసం నిర్మాత సెన్సార్ బోర్డు ముందు వ్యక్తిగతంగా హాజ‌రు కావాల్సి వుంది. అయితే ఇప్పుడు ఆ నిబంధ‌న స‌డ‌లించారు. నిర్మాత సౌల‌భ్యాన్ని బ‌ట్టి.. సినిమా ఎక్కడైనా ప్రదర్శించి సెన్సార్ చేసుకోవచ్చు. సినిమాను హార్డ్ డిస్క్ క్యూబ్‌ లలో తీసుకొచ్చినా సెన్సార్ చేస్తామన్నారు. నిర్మాతలు వ్యక్తిగతంగా హాజరుకాకున్నా ఆన్‌ లైన్‌ లో సందప్రదించి.. ఈ-మెయిల్‌ ద్వారా సర్టిఫికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.