Begin typing your search above and press return to search.

దసరాతో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ఊపు వచ్చేలా ఉంది

By:  Tupaki Desk   |   10 Sept 2021 6:00 AM IST
దసరాతో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ఊపు వచ్చేలా ఉంది
X
కరోనా ఫస్ట్‌ వేవ్‌ కారణంగా గత ఏడాది ఆరంభం నుండి దాదాపుగా ఏడు ఎనిమిది నెలల పాటు థియేటర్లలో సినిమాల విడుదల లేకుండా పోయింది. గత ఏడాది చివరి నుండి మెల్ల మెల్లగా సినిమాలు విడుదల అయ్యి ఈ ఏడాది మార్చి వరకు థియేటర్లు పూర్తిగానే ఓపెన్‌ అయ్యాయి. కాని కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా మళ్లీ థియేటర్లు మూత పడ్డాయి. ఈసారి మూడు నెలలకే థియేటర్లు తెరుచుకున్నా కూడా జనాలు థియేటర్లకు క్యూ కడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. దానికి తోడు చిన్న చిన్న సినిమాలు మాత్రమే విడుదల అవ్వడం వల్ల కూడా జనాలు థియేటర్లకు వెళ్లాలి అనే ఆసక్తిని కనబర్చడం లేదు. ఈ ఏడాది ఆరంభంలో పెద్ద సినిమాలు విడుదల అయ్యి మంచి వసూళ్లను దక్కించుకున్నాయి. కాని ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ఓకే అన్నట్లుగానే నిలిచాయి. అందువల్లే భారీ బ్లాక్‌ బస్టర్‌ కమర్షియల్‌ సక్సెస్‌ పడలేదు. కాని వచ్చే నెలలో భారీ బ్లాక్‌ బస్టర్ లు పడి మళ్లీ టాలీవుడ్ బాక్సాఫీస్ కు జోరు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దసరాకు ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా వస్తుందని అంతా అనుకున్నారు. కాని కరోనా కారణంగా ఆలస్యం అవ్వడంతో పాటు ఉత్తరాదిన ఇంకా థియేటర్లు పూర్తిగా ఓపెన్‌ కాలేదు. అందుకే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదలను వాయిదా వేయడం జరిగింది. దసరా బరి నుండి జక్కన్న మూవీ తప్పుకోవడం వల్ల ఇతర సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. అక్టోబర్‌ మొదటి వారం నుండి మొదలుకుని చివరి వరకు వరుసగా పెద్ద సినిమాలు వస్తున్నాయి. దసరా సీజన్ కు ముఖ్యంగా అఖండ మరియు మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమాలు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలకు తోడుగా కొండపొలం.. మహాసముద్రం సినిమాలు కూడా విడుదల అవ్వబోతున్నాయి. లవ్‌ స్టోరీని కూడా విడుదల చేస్తారేమో అంటూ వార్తలు వచ్చాయి. ఇంకా స్పష్టత రాలేదు.

దిల్‌ రాజు ఇంటి వారసుడు అశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవ్వబోతున్న రౌడీ బాయ్స్ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. దసరాకు ఆ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. చిన్న పెద్ద సినిమాలు కలిపి అక్టోబర్‌ లో పది వరకు విడుదల అయ్యే అవకాశం ఉంది. అందులో అయిదు సినిమాలు ఖచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా నమ్మకం ఉంది. దసరా సీజన్ లో విడుదల అవ్వబోతున్నాయి కనుక జనాలు కూడా థియేటర్లకు క్యూ కట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్‌ వద్ద మళ్లీ సందడి కనిపించబోతుందని.. దసరా సినిమాలతో టాలీవుడ్ కు ఊపు వస్తుంది. తద్వార దీపావళి మరియు క్రిస్మస్ ఇంకా సంక్రాంతి సినిమాలు కూడా ఖచ్చితంగా భారీగా విడుదల అయ్యే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావం దసరా సినిమాల బాక్సాఫీస్ సందడిని బట్టి తేలిపోనుంది.