Begin typing your search above and press return to search.

ఈ సినిమా టికెట్ చూశాక.. మూవీకి వెళ్లాలన్న ప్లాన్ పోస్ట్ పోన్

By:  Tupaki Desk   |   31 Dec 2021 4:42 AM GMT
ఈ సినిమా టికెట్ చూశాక.. మూవీకి వెళ్లాలన్న ప్లాన్ పోస్ట్ పోన్
X
ఆశ తప్పేం కాదు. కానీ.. దురాశ ఏ మాత్రం మంచిది కాదు. కొండ నాలుక కోసం ఉన్న నాలుకను ఎవరైనా పోగొట్టుకుంటాడా? ఒకవేళ అలా చేస్తే వాడు కచ్ఛితంగా తెలివితక్కువ వాడే. ఏపీలో సినిమా టికెట్ ధరల రచ్చ ఓవైపు సాగుతున్న వేళ.. అక్కడి పరిస్థితికి పూర్తి భిన్నంగా తెలంగాణలో సినిమా టికెట్ల ధరల్ని పెంచుకోవటానికి వీలుగా ఈ మధ్యనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం తెలిసిందే. ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సినిమా టికెట్ల ధరల పెంపు ఉత్తర్వుల్ని హడావుడిగా జారీ వేయటం వెనుక.. కోర్టు ఇచ్చిన గడువు ఒకటైతే.. మరొకటి టాలీవుడ్ శిల్పి జక్కన్న మాష్టారి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసమన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. కనిష్ఠం.. గరిష్ఠమని చెబుతూ ఎంత నుంచి ఎంతవరకు టికెట్ ధరను డిసైడ్ చేసుకోవాలో స్పష్టమైన ఉత్తర్వును జారీ చేసింది. ఇప్పటివరకు టికెట్ ధరలోనే జీఎస్టీ కలిసి ఉండేది. అందుకు బదులుగా తాజా ఉత్తర్వులో మాత్రం టికెట్ ధర వేరుగా.. జీఎస్టీ అదనంగా వసూలు చేయొచ్చన్న అవకాశాన్ని ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఈ రోజు (శుక్రవారం) హీరో శ్రీవిష్ణు నటించిన ‘అర్జున ఫల్గుణ’ మూవీ విడుదలైంది. ఈ మూవీ టికెట్ ధర విన్నంతనే దిమ్మ తిరిగిపోయే షాకిచ్చేలా ఉంది. ఒక యూత్ హీరో నటించిన చిన్న సినిమాకు పెద్ద ధర డిసైడ్ చేయటం విస్మయానికి గురి చేసింది.

దీనికి సంబంధించిన ఒక టికెట్ ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించి ప్రసాద్ ఐమాక్స్ లోని స్క్రీన్ నెంబరు 4లో ఉదయం 8.45 గంటల షో టికెట్ రూ.250గా.. దాని మీద జీఎస్టీ కలుపుకుంటే మరో రూ.45అదనంగా ఛార్జి చేశారు. మొత్తంగా ఒక టికెట్ ధర ఏకంగా రూ.295గా మారింది. మొన్నటి వరకు రూ.120 ఉన్న టికెట్ తర్వాత రూ.150 మారటం తెలిసిందే. ఈ మధ్యనే దాన్ని రూ.200కు మార్చారు.

అది కూడా కాస్తంత పెద్ద సినిమాలకు అని సర్దుకుపోయిన పరిస్థితి. ఇప్పుడు అందుకు భిన్నంగా ఒక చిన్న సినిమాకు రూ.295 ధరను ఫిక్స్ చేస్తే.. సినిమా చూడాలన్న కోరిక చచ్చిపోయేలా తాజా టికెట్ ధర ఉందన్న హాహాకారాలు వినిపిస్తున్నాయి. తాజా ధరను చూస్తే.. భారీ బడ్జెట్ తో తీసిన పుష్ప టికెట్ కంటే ఎక్కువ ధర ఉండటం దేనికి సంకేతం? ఇలాంటి తీరుతో.. థియేటర్లో సినిమా చూడాలన్న ఆలోచన పోయేలా టికెట్ ధరల్ని డిసైడ్ చేయటం దురాశ కాక మరేంటి?

భారీ బడ్జెట్ తో తీసిన సినిమాకు భారీగా టికెట్ ధర అన్నది కూడా సబబు కాదు. కానీ.. వారికి అయ్యే నిర్మాణ ఖర్చుల నేపథ్యంలో సర్లేనని సర్దుకుపోవచ్చు. అలా అని.. చిన్న సినిమాకు భారీగా ధరను డిసైడ్ చేస్తే.. దాన్ని దోపిడీ అనక ఇంకేమంటారు? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఒక చిన్న సినిమాకు ఇంతలా టికెట్ ధర డిసైడ్ చేశాక.. మూడు గంటల వినోదం కంటే రూ.300 విలువైనవి అన్న భావన కలిగితే.. వచ్చే కాస్త కలెక్షన్ పోవటం ఖాయం. ఆశ మంచిదే.. దురాశతో మొదటికే మోసం వస్తుందన్న లాజిక్ ను ఎలా మిస్ అవుతున్నారు?