Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: బ్యాంకులో బుల్లెట్లు కురిపిస్తూ ఆ గేమేంటి?

By:  Tupaki Desk   |   1 Jan 2023 4:41 AM GMT
ట్రైలర్ టాక్: బ్యాంకులో బుల్లెట్లు కురిపిస్తూ ఆ గేమేంటి?
X
త‌ళా నువ్వు ఏం చేసినా సంథింగ్ సంథింగ్! ఓ వైపు మెషీన్ గ‌న్స్ తో బుల్లెట్లు కురిపిస్తావు..! ఇంకోవైపు తైత‌క్క‌లాడుతూ డ్యాన్సులాడుతూ బ్యాంక్ ఆఫీస‌ర్లు పోలీసోళ్ల‌ను ఆడుకుంటావు!! బ్యాంక్ దోచుకోవ‌డానికి వ‌చ్చిన నువ్వు నీ ప‌ని ఏదో చేసుకుని పోకుండా ఎందుకు ఇంత ఆట ఆడ‌తావు? క‌రెన్సీ క‌ట్ట‌ల‌న్నీ అలా త‌గ‌లెట్టేస్తావు? పోలీసోళ్ల‌ను ప‌రిగెట్టించి విసిగిస్తావు. ఏ వీడియో గేమ్ లోనో స‌ర‌దాగా ఆడుకున్నట్టు అధికారుల్ని కాప్స్ ని ప‌రుగులెట్టిస్తావు.. అస‌లు ఏమి ఈ ఆట‌?

ఇన్ని ర‌కాల సందేహాల్ని క‌లిగించింది త‌ళా అజిత్ న‌టించిన తునివు ట్రైల‌ర్. బుల్లెట్ల వ‌ర్షం కురిపిస్తూ బ్యాంక్ లోకి దూరాడు. ఆ త‌ర్వాత అస‌లు ఆట మొద‌లెట్టాడు. చివ‌రికి ఈ ఆట‌లోకి హెలీ కాఫ్ట‌ర్లు .. స‌ముద్రంలో మ‌ర‌బోట్లు అబ్బోహ్.. లావిష్ విజువ‌ల్స్ తో త‌ళా ఆట‌ను ర‌క్తి క‌ట్టించాడు.

నిజానికి ఇది రొటీన్ సినిమా కాదు. అలాగ‌ని కొత్త కంటెంట్ ప్ర‌జ‌లు చూడ‌ని కంటెంట్ తో తీసిన సినిమా కాదు. ఇప్ప‌టికే బ్యాంక్ దోపిడీ నేప‌థ్యం రాజ‌కీయాల నేప‌థ్యంలో బోలెడ‌న్ని హాలీవుడ్ సినిమాలొచ్చాయి. వాటికి కాపీలా ఉందీ సినిమా కంటెంట్. కానీ ట్రైల‌ర్ గ్రిప్పింగ్ గా ఉంది. ఇక ట్రైల‌ర్ ఆద్యంతం త‌ళా నేచుర‌ల్ లుక్.. ఇస్ట‌యిల్ ఆక‌ట్టుకున్నాయి.

ఆస‌క్తిక‌రంగా హోలోగ్రామ్ లో ప్రదర్శించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రైలర్ ఇద‌ని టీమ్ చెబుతోంది. అజిత్ కుమార్ నటించిన `తునీవు` ఈ పండుగ బ‌రిలో గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. మేకర్స్ ఈ చిత్రాన్ని కొత్త మార్గాల్లో ప్రమోట్ చేస్తున్నారు. డిసెంబర్ 31 ని `తునీవు డే`గా మేకర్స్ ప్రకటించారు. ప్రకటించినట్లుగానే ట్రైల‌ర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇప్పుడు `తునివు` ట్రైలర్ ని మలేషియాలో హోలోగ్రామ్ లాంచ్ ద్వారా రిలీజ్ చేయ‌గా ప్రపంచ రికార్డును సృష్టించింద‌ని టీమ్ చెబుతోంది. అజిత్ నటించిన ట్రైలర్ కోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూశారు.

ఇక హోలోగ్రామ్ ట్రైల‌ర్ కోసం మలేషియా డిస్ట్రిబ్యూటర్ కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. తునివు ట్రైలర్ ప్రపంచంలోనే తొలిసారిగా హోలోగ్రామ్ ద్వారా ట్రైలర్ డిస్ప్లే చేశామ‌ని వెల్ల‌డించారు. ఈ ప్రత్యేక లాంచ్ మలేషియా కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు విడుద‌లైంది. అక్క‌డ ట్రైలర్ 7 PM ISTకి విడుదల చేయడానికి లోడ్ అయింద‌ని స‌మాచారం. తునీవు సంబ‌రాలు ఇక ఘ‌నంగా మొద‌ల‌య్యాయి. హోలోగ్రామ్ లాంచ్ ద్వారా అజిత్ ఒక బెంచ్‌మార్క్ సెట్ చేశాడ‌ని అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

తమిళనాడులోని పలు థియేటర్లు ఎటువంటి ఖర్చు లేకుండా `తునివు` ట్రైలర్‌ను ప్రత్యేక ప్రదర్శనను ప్రకటించాయి. అజిత్ ఆవేశాన్ని థియేట‌ర్ల‌లో చూసేందుకు తంబీలు క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురుచూస్తున్నారు. తునివు 2023 గ్రాండ్ ఫెస్టివల్ కి థియేటర్లలోకి రాబోతున్నందున ఇది అజిత్ అభిమానులకు అతి పెద్ద పండ‌గ‌.

`తునీవు` థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని త‌మిళ ట్రేడ్ చెబుతోంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అజిత్ కెరీర్ లోనే అతిపెద్ద విడుదలగా చెబుతున్నారు.. బ్యాంకు దోపిడీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అజిత్ నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు. అయితే తెలుగు మార్కెట్లో తునివు కి అంత‌గా బ‌జ్ లేక‌పోవ‌డం అజిత్ కి కొంత మైన‌స్.