Begin typing your search above and press return to search.

త్రోబ్యాక్: శోభనం గదిలో చిరంజీవి - బాలయ్యల సరదా ముచ్చట్లు..!

By:  Tupaki Desk   |   7 Nov 2022 3:34 PM GMT
త్రోబ్యాక్: శోభనం గదిలో చిరంజీవి - బాలయ్యల సరదా ముచ్చట్లు..!
X
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహం నందమూరి బాలకృష్ణల మధ్య దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. గతంలో అనేక సందర్భాల్లో వీరిద్దరూ ఒకేసారి పోటీ పడి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసారు. ఆ తర్వాత కొన్నాళ్ళు రాజకీయాల్లోనూ అది కొనసాగింది.

ఈ రెండు ఫ్యామిలీల నుంచి వచ్చిన తర్వాతి తరం హీరోల విషయంలోనూ ఈ పోరు నడిచింది. ఇక మెగా మరియు నందమూరి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. మా హీరో గొప్ప అంటే.. కాదు మా హీరో గొప్ప అంటూ రెండు వర్గాలూ తరచుగా గొడవలకు దిగుతుండటం కామన్ గా చూస్తుంటాం.

ఇప్పుడంటే నెట్టింట మాటల యుద్ధాలు చేసుకుంటున్నారు కానీ.. అప్పట్లో అయితే థియేటర్ల వద్ద రోడ్లపై బాహాబాహీకి దిగేవారు. అయితే చాలా ఏళ్ళ తర్వాత హేమాహేమీలు బాలయ్య మరియు చిరంజీవి ఇప్పుడు బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అయ్యారు.

ఇద్దరు సీనియర్ హీరోలు నటించిన సినిమాలు ఒక్క రోజు గ్యాప్ తో విడుదల కాబోతున్నాయి. అందుకే గతంలో మెగాస్టార్ - నటసింహం మధ్య స్నేహం - ఆధిపత్య పోరు మరియు బాక్సాఫీస్ లెక్కలు వంటివి ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చిరు - బాలకృష్ణ కలిసి ఉన్న ఓ త్రో బ్యాక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో శోభనం కోసం అలంకరించిన బెడ్ మీద అగ్ర హీరోలిద్దరూ దేని గురించో మాట్లాడుకుంటునట్లు కనిపిస్తోంది. ఈ ఫోటో చూసి ఇరు వర్గాల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇది 'ఘరానా మొగుడు' సినిమా షూటింగ్ సందర్భంలో తీసిన ఫోటో అని తెలుస్తోంది. 1992 లో విడుదలైన ఈ మూవీ ఓపెనింగ్ కి బాలయ్య గెస్టుగా వచ్చారు. దర్శకుడు కె రాఘవేంద్ర రావు ఈ మూవీ షూటింగ్ ని శోభనం సీన్ చిత్రీకరణతో ప్రారభించించాలని ప్లాన్ చేసారు.

ఆ సన్నివేశం కోసం శోభనం గదిని సెట్ చేయగా.. దాని మీద కూర్చొని చిరు - బాలయ్య ముచ్చట్లు పెట్టారు. ఇందులో మెగాస్టర్ సీన్ కు తగ్గట్టుగా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఉండగా.. యువరత్న మాత్రం ప్రింటెడ్ బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తుల్లో ఉన్నారు.

నిజానికి అప్పట్లో బాక్సాఫీస్ వద్ద వీరి సినిమాలు పోటీ పడ్డప్పటికీ.. బయట మాత్రం ఇద్దరూ చాలా స్నేహపూర్వకంగా మెలుగుతూ ఉండేవారు. ఒకరి సినిమాల ఈవెంట్స్ మరొకరు వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకునేవారు. కాకపోతే ఈ మధ్య కాలంలో పెద్దగా కలిసి కనిపించలేదు.

అయితే ఇప్పుడు చిరంజీవి మరియు బాలకృష్ణ ఇద్దరూ 2023 సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. వారు నటించిన “వాల్తేరు వీరయ్య” మరియు “వీరసింహా రెడ్డి” సినిమాలు రెండూ జనవరిలో ఒక్క రోజు గ్యాప్ తో థియేటర్లలోకి రాబోతున్నాయి. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తారు.

సీనియర్ హీరోలు కొన్నేళ్ల తర్వాత పెద్ద పండక్కి పోటీ పడుతుండటంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందాయి.

మామూలుగా ఒకే ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన రెండు భారీ సినిమాలు ఒకేసారి విడుదలవ్వడం జరగదు. కానీ టాలీవుడ్ లో వచ్చే సంక్రాంతికి అలాంటి అరుదైన బాక్సాఫీస్ ఫైట్ ని చూడబోతున్నాం. మరి ఈ పోరులో వాల్తేరు వీరయ్య గెలుస్తాడో.. వీర సింహా రెడ్డి నెగ్గుతాడో.. ఇద్దరూ విజేతలుగా నిలుస్తారో వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.