Begin typing your search above and press return to search.

సరిగ్గా మూడేళ్ల కిందట.. ప్రభాస్ అలా

By:  Tupaki Desk   |   6 July 2016 2:49 PM IST
సరిగ్గా మూడేళ్ల కిందట.. ప్రభాస్ అలా
X
కొన్ని విషయాలు మొదలయ్యేటపుడు తెలియవు.. వాటికి చరిత్రలో ప్రత్యేకమైన స్థానం దక్కబోతోందని. ‘బాహుబలి’ సినిమా మొదలుపెట్టేటపుడు రాజమౌళి సహా ఎవ్వరూ కూడా ఆ సినిమా ఇంత ప్రభంజనం సృష్టిస్తుందని.. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుందని.. భారతీయ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తుందని.. ఇంతేసి కలెక్షన్లు సాధిస్తుందని అనుకుని ఉండరు. అసలు ‘బాహుబలి’ మొదలయ్యేటపుడు దాన్ని హిందీలోనూ రిలీజ్ చేయాలన్న ఆలోచన కూడా జక్కన్నకు లేదు. ఆ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని కూడా అనుకోలేదు. కానీ తర్వాత ఈ సినిమా ఎన్నో మలుపులు తిరిగింది. చారిత్రక విజయం సాధించి భారతీయ ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకుంది.

ఇప్పుడీ ప్రస్తావనంతా ఎందుకంటే సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజు ‘బాహుబలి’ షూటింగ్ మొదలైంది. కర్నూలు దగ్గర ఓ కొండ ప్రాంతంలో ప్రభాస్ మీద తొలి షాట్ చిత్రీకరించాడు రాజమౌళి. షూటింగ్ మొదలవడానికి ముందు తన కోసం వచ్చిన వేలాది మంది అభిమానులకు అభివాదం చేస్తూ ప్రభాస్ కనిపించిన దృశ్యం ఇంకా అందరి కళ్లముందు కదలాడుతూనే ఉంది. జుట్టు బాగా పెంచుకుని.. నెత్తిన టోపీ పెట్టుకుని.. టీషర్టులో అభిమానుల్ని గ్రీట్ చేశాడు ప్రభాస్. అదే లొకేషన్లో దర్శకుడు రాజమౌళి.. నిర్మాత శోభు యార్లగడ్డ షూటింగుకి సంబంధించి సీరియస్‌ గా డిస్కస్ చేస్తున్న ఫొటో కూడా ‘బాహుబలి’ టీం సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఇవాల్టికి షూటింగ్ మొదలై మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘బాహుబలి’ ట్విట్టర్ పేజీలో నాటి ఫొటోల్ని షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నాడు నిర్మాత శోభు.