Begin typing your search above and press return to search.

మారిన ఇద్దరు.. మూసలో ముగ్గురు..

By:  Tupaki Desk   |   3 Sep 2017 5:33 AM GMT
మారిన ఇద్దరు.. మూసలో ముగ్గురు..
X
బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన పైసా వసూల్.. ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. సినిమాకు టాక్ బాగుండకపోవడమే కాదు.. బాలయ్య కొత్త తరహాలో చూపించిన నటన మినహాయిస్తే.. మిగిలిన మూవీలో ఏం లేదని అనేస్తున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన పోకిరి కథనే అటూ ఇటూ చేసి బాలయ్యతో తీసేశాడని.. పిక్చరైజేషన్ లో కూడా ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించలేకపోయాడనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

తన ఫార్ములాలోనే సినిమా తీసి.. దాదాపుగా మరో పరాజయాన్ని ఖాయం చేసుకున్నాడు పూరీ. ఇలా ఒకటే టెంప్లేట్ తో అరిగిపోయిన కథలను జనాల మీద రుద్దే ప్రయత్నం చేసిన మరో ఇద్దరు దర్శకులకు కూడా జనాలు ఇలాంటి ట్రీట్మెంట్ నే ఇచ్చారు. ఒకప్పుడు టాప్ డైరెక్టర్లుగా వెలిగిన కృష్ణవంశీ.. శ్రీను వైట్ల సినిమాలు కూడా ఇలానే డింకీ కొట్టేశాయి. నక్షత్రం మూవీకి 80ల నాటి కథ.. 70ల నాటి కథనం.. అంటూ విమర్శలను కృష్ణవంశీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక మిస్టర్ అంటూ వరుణ్ తేజ్ తో శ్రీను వైట్ల సక్సెస్ అందుకుంటాడని భావిస్తే.. ఆ కుర్రాడి కెరీర్ కు కూడా ఓ మచ్చను అంటించేశాడు. తన ఫార్మాట్ లోనే హంగామా చేసి.. ఘోర పరాజయాన్ని చవి చూశాడు.

కానీ ఓ ఇద్దరు దర్శకులు మాత్రం కొత్త రకంగా ఆలోచించి తిరుగులేని విజయాలను సాధించారు. ఫిదా అంటూ శేఖర్ కమ్ముల తీసిన లవ్ స్టోరీకి.. టాలీవుడ్ జనాలు నీరాజనాలు పట్టేశారు. వసూళ్లను 50కోట్లకు చేర్చేశారు. మరోవైపు లవ్ స్టోరీల నుంచి పొలిటికల్ యాంగిల్ కు మారిన తేజ కూడా నేనే రాజు నేనే మంత్రి అంటూ ఓ డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను అలరించగలిగాడు.

ఫైనల్ గా చెప్పేదంటంటే.. సీనియర్ దర్శకులు.. టాప్ డైరెక్టర్లుగా వెలిగిన వారు.. తమ ఫార్ములాను ఫార్మాట్ ను కాసింత పక్కనపెట్టి.. కొత్తగా ఏదైనా చూపిస్తే మినహా.. సినిమాకు వచ్చేందుకు జనాలు సిద్ధంగా లేరనే సంగతి అర్ధమైపోతోంది. ముందు వాళ్లను వాళ్లు మార్చుకుంటే తప్ప.. జనాలను మెప్పించడం కష్టమైన విషమయే.