Begin typing your search above and press return to search.

ముగ్గురు స్టార్ హీరోయిన్లను వెయిట్ చేయిస్తున్న మూడు సినిమాలు!

By:  Tupaki Desk   |   22 April 2021 7:00 AM IST
ముగ్గురు స్టార్ హీరోయిన్లను వెయిట్ చేయిస్తున్న మూడు సినిమాలు!
X
నయనతార .. నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేయడంలో ఆమెకి ఆమెనే సాటి. కథ ఏదైనా .. పాత్ర్ర ఏదైనా తెరపై నుంచి దృష్టి మళ్లించని నటన ఆమె సొంతం. అలాంటి నయనతార తాజా చిత్రంగా 'నేట్రికన్' రూపొందింది. ఈ సినిమాలో నయనతార అంధురాలిగా నటించింది. సీరియల్ మర్డర్స్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ కథ ఇది. 'అవళ్' సినిమాతో ప్రేక్షకులను భయపెట్టేసిన మిలింద్ రావ్ ఈ సినిమాకి దర్శకుడు. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వదిలిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇక త్రిష ప్రధాన పాత్రగా 'రాంగి' రూపొందింది. కొంతకాలంగా త్రిష కూడా నయనతార బాటలోనే అడుగులు వేస్తూ, నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తోంది. అందులో భాగంగా రూపొందిన థ్రిల్లర్ చిత్రమే 'రాంగి'. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, అత్యధిక బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. ఇది ఏఆర్ మురుగదాస్ అందించిన కథ కావడంతో, అందరిలో ఆసక్తి ఉంది. సత్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తుందని అంటున్నారు. త్రిష కెరియర్లో ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుందని అంటున్నారు.

తెలుగులో కీర్తి సురేశ్ .. లేడీ ఓరియెంటెడ్ మూవీగా 'గుడ్ లక్ సఖి' సినిమా చేసింది. నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. జగపతిబాబు కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, కీర్తి సురేశ్ ఓ గిరిజన యువతిగా కనిపించనుంది. ఈ ముగ్గురు హీరోయిన్లు చేసిన ఈ మూడు పాత్రలు ఎంతో విభిన్నమైనవి. ఆందువలన వాళ్లు ఈ సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎప్పటికప్పుడు కరోనా కట్టడి చేస్తూ, వాళ్ల ఆశలపై ఐస్ నీళ్లు చల్లుతోంది. దాంతో ఈ సినిమాలు ఎప్పుడు థియేటర్ కి వస్తాయా అని వాళ్లంతా ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.