Begin typing your search above and press return to search.

ఈ ఏడాది హిట్టు కొట్టిన హీరోలు వీరే!

By:  Tupaki Desk   |   12 Dec 2020 6:30 AM GMT
ఈ ఏడాది హిట్టు కొట్టిన హీరోలు వీరే!
X
నలుగురు కలిస్తే చాలు .. పదిమంది పోగైతే చాలు, వాళ్ల మధ్య సినిమాను గురించిన చర్చ తప్పకుండా నడుస్తుంది. ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిన దగ్గర నుంచి థియేటర్ నుంచి వెళ్లెవరకూ అందరి నాలుకలపై నానుతూనే ఉంటుంది. ఎక్కువమంది ఎక్కువ సేపు మాట్లాడుకునే అంశం సినిమానే అంటే అతిశయోక్తి కాదేమో. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ .. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సమయంలో, ఏడాది పాటు వచ్చిన సినిమాలను గురించి మాట్లాడుకోవడం కూడా సహజంగా జరుగుతుంటుంది. అయితే అలా ఈ సారి పూర్తిస్థాయిలో చర్చించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే కరోనా కారణంగా ఈ ఏడాది మూడో నెల నుంచే థియేటర్లు మూతబడ్డాయి. అప్పటి నుంచి నిన్నమొన్నటి వరకూ అదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడిప్పుడే మల్టీ ప్లెక్స్ లు కొద్దికొద్దిగా తెరుచుకుంటున్నాయి.

ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో విడుదలైన సినిమాలను ఒకసారి వెనక్కి వెళ్లి పరిశీలిస్తే, వాటిలో ఒక మూడు సినిమాలు మాత్రమే థియేటర్ల దగ్గర సందడి చేశాయి. వినోదమే ప్రధానంగా సాగిన ఆ సినిమాలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, బాక్సాఫీసుల దగ్గర కాసుల వర్షాన్ని కురిపించాయి. థియేటర్లు మూతబడటానికి ముందు సందడి చేసిన ఆ సినిమాల సంగతులేమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది 'సంక్రాంతి'కి కొన్ని సినిమాలు బరిలోకి దిగాయి. ఆ సినిమాల్లో ప్రధానమైనవిగా 'సరిలేరు నీకెవ్వరు' .. 'అల వైకుంఠపురంలో' నిలిచాయి. 'సరిలేరు నీకెవ్వరు' విషయానికొస్తే, అనిల్ రావిపూడి దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కింది. మేజర్ అజయ్ కృష్ణగా మహేశ్ బాబు నటించిన ఈ సినిమాలో ఆయన జోడీగా రష్మిక మందన అలరించింది. చాలా గ్యాప్ తరువాత విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ పాళ్లను సమానంగా కలుపుకుని ఆవిష్కరించబడిన ఈ సినిమా, మహేశ్ బాబు కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. విడుదలైన అన్ని కేంద్రాల్లోను సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ సంక్రాంతి విజేతగా నిలిచింది. మహేశ్ బాబుకి హ్యాట్రిక్ హిట్ ను అందించి మరో ప్రత్యేకతను సంతరించుకుంది.

'సరిలేరు నీకెవ్వరు' విడుదలైన మరుసటి రోజునే 'అల వైకుంఠపురంలో' థియేటర్లకు వచ్చింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ తండ్రి, తన కొడుకును శ్రీమంతుడిగా చూసుకోవాలనే స్వార్థంతో చేసిన ఒక పని ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడీగా పూజా హెగ్డే నటించింది. త్రివిక్రమ్ తరహా ట్రీట్మెంట్ .. అల్లు అర్జున్ నటన .. పూజాహెగ్డే గ్లామర్ .. ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. తమన్ ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో సాగే కథ కావడంతో, సంక్రాంతి బరిలో ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోయింది. బన్నీ కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. ఇదే నెలలో 'ఎంతమంచివాడవురా'తో కల్యాణ్ రామ్ .. 'డిస్కోరాజా'గా రవితేజ .. 'అశ్వద్ధామ'గా నాగశౌర్య రంగంలోకి దిగినప్పటికీ ఆశించిన ప్రయోజనం మాత్రం నెరవేరలేదు.

ఫిబ్రవరి మాసంలో 'జాను' .. 'వరల్డ్ ఫేమస్ లవర్' .. 'భీష్మ' సినిమాలు భారీ అంచనాల మధ్య థియేటర్స్ కి వచ్చాయి. తమిళంలో వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలను అందుకున్న '96' మూవీని, 'జాను' పేరుతో తెలుగులోకి రీమేక్ చేసి వదిలారు. శర్వానంద్ - సమంత కలిసి నటించిన ఈ కథకి ఇక్కడ కూడా బ్రహ్మరథం పట్టడం ఖాయమని అనుకున్నారు. '96' దర్శకుడికే తెలుగు రీమేక్ బాధ్యతను అప్పగించారు. కానీ స్లో నేరేషన్ కారణంగా ఇక్కడి ప్రేక్షకులకు ఈ కథ అంతగా ఎక్కలేదు. ఇక విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' కూడా భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చి బొక్క బోర్లా పడింది. క్రాంతిమాధవ్ ఈ సినిమాలో మూడు కథలను చెప్పడానికి ప్రయత్నించాడు. కాకపోతే ఒక కథను చెప్పడంలోనే సక్సెస్ అయ్యాడు. ఫలితంగా అభిమానులను నిరాశ పరచడమే కాదు, విజయ్ దేవరకొండ జోరుకు కూడా కళ్లెం వేసేసింది.

ఈ నెల చివర్లో వచ్చిన 'భీష్మ' మాత్రం థియేటర్లను మళ్లీ కళకళలాడించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్ జోడీగా రష్మిక ఆకట్టుకుంది. ఈ ప్రేమకథా చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని, తనది గోల్డెన్ లెగ్ అనే విషయాన్ని మరోసారి నిరూపించింది. చాలాకాలం తరువాత నితిన్ కి ఊరటను ఇచ్చిన సినిమా ఇది. కామెడీ పాళ్లు తగ్గని కథాకథనాలు .. ఫైట్లు .. పాటలు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. అంతకుముందు కన్నా నాయకా నాయికలను అందంగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. యూత్ మెచ్చిన సినిమాగా 'భీష్మను నిలిపాడు. ఆ తరువాత వచ్చిన 'హిట్' .. 'రాహు' సినిమాలు ఆ స్థాయికి తగినట్టుగానే ఆడాయి.

మార్చి నెలలో 'పలాస 1978' .. 'ఓ పిట్టకథ' .. 'ప్రేమ పిపాసి' .. 'శివన్' సినిమాలు రాగా, ఒక్క 'పలాస' మాత్రమే ఫరవాలేదనిపించుకుంది. 1978లో 'పలాస'లో జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు కరుణకుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. పాత్రలను మలిచే విధానంలోను .. సన్నివేశాలకు సహజత్వాన్ని ఆపాదించే విషయంలోను దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే ఆయన ఎంచుకున్న కథాకథనాల కారణంగా ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించగలిగాడు. ఇలా ఈ ఏడాదిలో మూడు నెలల్లో మూడు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోగలిగాయి. బాక్సాఫీసు దగ్గర నుంచి భారీ లాభాలను తెచ్చిపెట్టగలిగాయి. కొత్త ఏడాది ఎవరెవరికి కలిసొస్తుందో .. ఎవరెవరికి సక్సెస్ ను కలిపిస్తుందో చూడాలి.