Begin typing your search above and press return to search.

నెంబర్ వన్ రేసులో ముగ్గురు ముద్దుగుమ్మలు

By:  Tupaki Desk   |   7 Dec 2020 11:00 AM IST
నెంబర్ వన్ రేసులో ముగ్గురు ముద్దుగుమ్మలు
X
తెలుగు తెరకు ఎంతోమంది అందమైన కథానాయికలు పరిచయమయ్యారు .. పడుచు హృదయాలను పరవశింపజేశారు. కొత్తగా వచ్చిన కథానాయిక తెల్లగులాబీలా .. తాజా తామరపువ్వులా కనిపిస్తే చాలు, కుర్రాళ్లంత అభిమానులై పోతారు .. ఆరాధకులైపోతారు. అందానికి అభినయం కూడా తోడైతే అలాంటి నాయికలను అందలం ఎక్కించేస్తారు .. అగ్రస్థానంలో కూర్చో బెట్టేస్తారు. అయితే ఆ స్థానంలో దర్జాగా కూర్చోవాలంటే అందం .. అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలా ఒక్కోతరంలో కొంతమంది నాయికలు స్టార్ హీరోయిన్లుగా చక్రం తిప్పేశారు. తమదైన ప్రత్యేకతను గుండె తలుపు తట్టిమరీ చెప్పేశారు.

ఒకానొకప్పుడు శ్రీదేవి .. జయసుధ .. జయప్రద స్టార్ హీరోయిన్స్ రేసులో దూసుకెళ్లారు. గ్లామర్ పరంగా .. నటన పరంగా ఎవరి ప్రత్యేకత వారిదే. ముగ్గురి ఖాతాలోను అనేక విజయాలు నమోదయ్యాయి. అయినప్పటికీ నెంబర్ వన్ ఎవరు ? అనే ప్రశ్నకి సమాధానంగా 'శ్రీదేవి' పేరే వినిపించింది. ఆ తరువాత కాలంలో విజయశాంతి .. రాధ .. భానుప్రియ మధ్య కూడా ఇలాంటి పోటీనే కొనసాగింది. గ్లామర్ పరంగా .. డాన్సుల పరంగా స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ను తమ సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురిలో తొలిస్థానం ఎవరికి దక్కుతుందనే సందేహానికి 'విజయశాంతి' పేరు సమాధానంగా నిలిచింది. ఆ తరువాత ఇదే తరహాలో రోజా .. మీనా .. సౌందర్య తమ జోరును కొనసాగించగా, 'సౌందర్య'కి ఎక్కువ మార్కులు పడ్డాయి.

ఇక ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై అగ్రకథానాయికల వరుసలో ఎక్కువ కాలం నిలిచినవారి జాబితాలో అనుష్క .. నయనతార .. త్రిష .. తమన్నా .. కాజల్ కనిపిస్తారు. వీళ్లందరూ కూడా తెలుగుతో పాటు సమానంగా తమిళ సినిమాలు కూడా చేస్తూ వెళ్లారు. ఈ రెండు భాషల్లోను స్టార్ డమ్ ను కొనసాగించారు. అయితే తెలుగుకి సంబంధించి అనుష్కను .. తమిళ సినిమాలకి సంబంధించి నయనతారను ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టేసి నీరాజనాలు పట్టేశారు. అందుకు కారణం లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోను వాళ్లు తమ సత్తాను చాటుకోవడమే .. హీరోలతో సమానమైన క్రేజ్ ను సంపాదించుకోవడమే.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ ఇచ్చినప్పటి పరిస్థితులు వేరు .. అందువలన ఆమె చాలా ఫాస్టుగా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. స్టార్ హీరోలందరితో చకచకా సినిమాలను చుట్టబెట్టేసింది. అయితే అదే స్పీడ్ ను ఆమె కొనసాగించలేకపోయింది. అదే సమయంలో కొంతమంది కొత్త కథానాయికలు తెలుగు తెరకు తన నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేశారు. వాళ్లలో ఓ ముగ్గురిని మాత్రం అవకాశాలతో పాటు వరుస విజయాలు వరించాయి. ఆ ముగ్గురే పూజా హెగ్డే .. కీర్తి సురేశ్ .. రష్మిక మందన.

'అరవింద సమేత' .. 'మహర్షి' .. 'గద్దలకొండ గణేశ్' .. 'అల వైకుంఠపురంలో' అందించిన విజయాలు పూజా హెగ్డేను ఎక్కడికో తీసుకెళ్లాయి. సన్నజాజి పువ్వులాంటి ఈ అమ్మాయిని సక్సెస్ కి మరోపేరుగా చెప్పుకుంటున్నారు. త్వరలో ఆమె ప్రభాస్ సరసన .. అఖిల్ జోడీగాను అభిమానులను అలరించనుంది. ఇక ముద్దబంతిలా మురిపించే కీర్తి సురేశ్ విషయానికొస్తే 'మహానటి'తో ఆమెకి వచ్చిన క్రేజ్ కి ఇప్పట్లో ఢోకా లేదు. 'గుడ్ లక్ సఖి' .. 'రంగ్ దే' వంటి సినిమాలు త్వరలో ప్రేక్షకులను పలకరించనుండగా, తొలిసారిగా మహేశ్ బాబు సరసన 'సర్కారువారి పాట'లోను ఛాన్స్ కొట్టేసింది.

తెరపై పాలకోవాలా .. పంచదార చిలకలా కనిపించే రష్మిక మందన కూడా తక్కువేం తినలేదు. 'ఛలో' .. 'గీతగోవిందం' .. 'సరిలేరు నీకెవ్వరు' .. 'భీష్మ' విజయాలను చాలా వేగంగా ఆమె తన ఖాతాలో జమచేసుకుంది. వరుసగా ప్రేమకథలే చేస్తూ, యూత్ నుంచి విపరీతమైన ఫాలోయింగును రాబట్టుకుంది. పాలరాతి శిల్పం వంటి ఈ అమ్మాయి చేతిలో ప్రస్తుతం 'పుష్ప' .. 'ఆడాళ్లూ మీకు జోహార్లు' వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలా టాలీవుడ్లో ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు దుమ్మురేపేస్తున్నారు. నెంబర్లపై తమకి నమ్మకం లేదంటూనే, నెంబర్ వన్ అనిపించుకునే దిశగా పరుగులు తీస్తున్నారు. మరి ఈ ముగ్గురు భామల్లో ఆ స్థానం ఎవరికి దక్కుతుందో .. ఎవరికి చిక్కుతుందో చూడాలి.