Begin typing your search above and press return to search.

ఆ హీరోను చంపేస్తామని బెదిరింపులు

By:  Tupaki Desk   |   12 Oct 2015 7:31 AM GMT
ఆ హీరోను చంపేస్తామని బెదిరింపులు
X
నడిగర్ సంఘం ఎన్నికలు ఉద్రిక్తంగా మారుతున్నాయి... ఇంతవరకు ఆరోపణలు - ప్రత్యారోపణలు సవాళ్లు - ప్రతిసవాళ్లకే పరిమితమైన ఈ పోటీలో ఇప్పుడు బెదిరింపుల వరకూ వెళ్తున్నారు. తాజాగా పాండవర్ జట్టు ప్రధాన కార్యదర్శి అభ్యర్థి - నటుడు విశాల్‌ ను హతమారుస్తామని బెదిరింపులు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపుల నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను పెంచారు. మరోవైపు నాటక రంగ కళాకారులకూ బెదిరింపులు వస్తున్నాయని చెబుతున్నారు. మునుపెన్నడూ లేనట్లుగా ఈసారిగా తీవ్రస్థాయి బెదిరింపులు కూడా వస్తుండడంతో ఈ నెల 18న జరగనున్న ఎన్నికల నాటికి ఇంకా ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అన్న ఆందోళన నెలకొంటోంది.

నడిగర్ సంఘం ప్రస్తుత అధ్యక్షుడు , ఎమ్మెల్యే శరత్‌ కుమార్ నేతృత్వంలోని ప్యానల్ తో .... నటుడు నాజర్ అధ్యక్షుడిగా - విశాల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్యానల్ పోటీపడుతోంది. ఎన్నికల్లో గెలుపు కోసం రెండు ప్యానళ్లూ అన్ని మార్గాలూ అన్వేషిస్తున్నాయి. ఫలితం నాజర్ - విశాల్ నేతృత్వంలోని జట్టుకు అనుకూలంగా ఉండొచ్చని సర్వేలు చెబుతున్నా పోటీ తీవ్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో రెండు ప్యానళ్లు విమర్శలు, ఆరోపణలతో వేడి పుట్టిస్తున్నారు.

తాజాగా బెదిరింపులూ వస్తున్నాయనడంతో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. విశాల్ కు కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపేస్తామంటున్నారని పేర్కొంటూ ఆయన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నై అన్నానగర్ డీ బ్లాక్ పన్నెండో వీధిలో ఉన్న ఆయన ఇల్లు, కార్యాలయానికి భద్రత కల్పించారు.