Begin typing your search above and press return to search.

టాలీవుడ్: ప్యాన్ ఇండియా భవితను తేల్చేది ఆ సినిమాలే

By:  Tupaki Desk   |   10 April 2020 2:45 AM GMT
టాలీవుడ్: ప్యాన్ ఇండియా భవితను తేల్చేది ఆ సినిమాలే
X
తెలుగు సినిమాల కంటే తమిళ సినిమాల రేంజ్..రీచ్ ఎక్కువ. వాటికంటే హిందీ సినిమాల రీచ్ ఎక్కువ.. బడ్జెట్ లు ఎక్కువ. ఇది 'బాహుబలి' కి ముందు ఉన్న అభిప్రాయం. అయితే ' బాహుబలి' తర్వాత ఆ హద్దులు అన్నీ చెరిగిపోయాయి. కంటెంట్ ఉంటే చాలు.. ఏ భాషా చిత్రమైనా దేశవ్యాప్తంగా ఘన విజయం సాధిస్తుందని.. దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు బ్రహ్మరథం పడతారని తేలిపోయింది. దీంతో ప్యాన్ ఇండియా సినిమాల జోరు పెరిగింది. ప్రభాస్ 'సాహో' సౌత్ లో నిరాశ పరిచింది గాని హిందీ లో మాత్రం దుమ్ము రేపింది. 'సైరా' విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలకు అవతల ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

నిజానికి ఈ రెండు సినిమాల ఫలితం టాలీవుడ్ లో ప్యాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్న నిర్మాతలను ఆలోచనల్లో పడేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దాదాపు నాలుగు సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నాయి. ఈ సినిమాల జయాపజయాలు టాలీవుడ్ లో భవిష్యత్తులో తెరకెక్కబోయే పాన్ ఇండియా సినిమాల భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

ఆ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోదగినవి నాలుగు ప్రాజెక్టులు. మొదటిది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR. ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఇద్దరూ ప్రభాస్ తరహాలో హిందీ ప్రేక్షకులను మెప్పించగలరా అనేది వేచి చూడాలి. ఇప్పటివరకు అయితే ఈ సినిమా రాజమౌళి బ్రాండ్ మీదనే పాన్ ఇండియా సినిమాగా చలామణి అవుతోంది.

ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ కొత్త సినిమా 'జాన్' కూడా ప్యాన్ ఇండియా సినిమానే. విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఫైటర్' కూడా ప్యాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ జాబితాలోకి అల్లు అర్జున్ సుకుమార్ సినిమా 'పుష్ప' కూడా వచ్చి చేరింది. అల్లు అర్జున్ కూడా ప్యాన్ ఇండియా పై కన్నేసిన సంగతి నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయిన సమయంలోనే అర్థం అయింది. ఈ సినిమాలలో కనీసం రెండు సినిమాలు కనుక దేశవ్యాప్తంగా విజయం సాధిస్తే టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఇకపై తమ సినిమాలను తెలుగుకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్ధ పడడం ఖాయం. అలా కాకుండా ఈ సినిమాలు కనుక మిగతా భాషల్లో నిరాశ పరిస్తే ప్యాన్ ఇండియా కలలకు ఫుల్ స్టాప్ పడ్డట్టే. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.