Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘తొలి ప్రేమ’

By:  Tupaki Desk   |   10 Feb 2018 9:00 AM GMT
మూవీ రివ్యూ: ‘తొలి ప్రేమ’
X
చిత్రం : ‘తొలి ప్రేమ’

నటీనటులు: వరుణ్ తేజ్ - రాశి ఖన్నా - ప్రియదర్శి - సుహాసిని - నరేష్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: జార్జ్ సి.విలియమ్స్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
రచన - దర్శకత్వం: వెంకీ అట్లూరి

ఈ తరంలో ఎక్కువగా ప్రేమకథలు చేస్తున్న కథానాయకుల్లో వరుణ్ తేజ్ ఒకడు. గత ఏడాది అతడికి ఘనవిజయాన్నందించిన ‘ఫిదా’ కూడా ప్రేమకథే. ఇప్పుడతను ‘తొలి ప్రేమ’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘స్నేహగీతం’..‘జ్ఞాపకం’ లాంటి సినిమాల్లో నటించిన వెంకీ అట్లూరి దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రమిది. ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఆదిత్య (వరుణ్ తేజ్) అనుకోకుండా రైల్వే స్టేషన్ లో పరిచయమైన వర్ష (రాశి ఖన్నా)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమెకు కూడా అతడిపై పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. తర్వాత ఇద్దరూ ఒకే కాలేజీలో చేరతారు. అక్కడ ఇద్దరి మధ్య ప్రేమ బంధం బలపడుతుంది. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక గొడవ వల్ల ఇద్దరూ విడిపోతారు. తర్వాత ఎవరి జీవితాలు వాళ్లవి. కానీ ఆరేళ్ల ఎడబాటు తర్వాత ఇద్దరూ మళ్లీ కలుస్తారు. మరి ఈ కలయిక వాళ్లను మళ్లీ ఎలా దగ్గర చేసిందన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ప్రస్తుతం ప్రేమ విషయంలో యువత ఆలోచనలు మారిపోయాయి. ఈ స్పీడ్ యుగంలో తొలి ప్రేమ అని.. స్వచ్ఛమైన ప్రేమ అని.. గాఢమైన ప్రేమ అని.. సినిమాల్లో ముచ్చట్లు చెబితే వాటిని ఇప్పటి ప్రేక్షకులు ఏమాత్రం రిసీవ్ చేసుకుంటారో అన్న సందేహాలున్నాయి. గతంలో మాదిరి గాఢమైన ప్రేమకథలు ఇప్పుడు రావట్లేదు. అసలు ప్రేమకథలే తగ్గిపోయాయిప్పుడు. అప్పుడప్పుడూ లవ్ స్టోరీలు వస్తున్నా.. ప్రేక్షకుల్లో ఫీల్ తీసుకొచ్చి.. వాళ్లను స్పందింపజేసేవి చాలా తక్కువగా ఉంటున్నాయి. ఐతే ‘తొలి ప్రేమ’ అలాంటి అరుదైన సినిమాల్లో ఒకటి. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ఇదొకటి అనడంలో సందేహం లేదు. గత ఏడాది వరుణ్ నటించిన ‘ఫిదా’ ఎలా ప్రేక్షకుల్ని మెప్పించిందో.. అదే స్థాయిలో ఆకట్టుకునే విషయం ‘తొలి ప్రేమ’లో ఉంది. ఇందులో లోపాలు లేవని కాదు కానీ.. అంతిమంగా ఒక మంచి ప్రేమకథ చూసిన భావన మాత్రం ప్రేక్షకులకు కలుగుతుందనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందటి ‘తొలి ప్రేమ’తో దీన్ని పోల్చలేం కానీ.. దీని ప్రత్యేకత దీనికుంది.

ప్రేక్షకుల్లో ఒక ఫీల్ తీసుకురావడంలో ప్రేమకథల విజయం దాగి ఉంటుంది. ప్రేమ అనుభవాలున్న ప్రతి ఒక్కరూ తమను తాము ఐడెంటిఫై చేసుకుని.. అనుభూతి చెందితే ఆ ప్రేమకథ పండినట్లే. ‘తొలి ప్రేమ’ అలాంటి ఫీల్ తీసుకురావడంలో విజయవంతమైంది. ఈ కథ కొత్దదేమీ కాదు. ‘ఊహలు గుసగుసలాడే’.. ‘ఫిదా’ లాంటి సినిమాల తరహాలోనే.. లవ్-హేట్-లవ్ లైన్లోనే సాగుతుందీ చిత్రం. ఐతే సన్నివేశాల్లో తాజాదనం.. ముఖ్యంగా ప్రథమార్ధంలో ప్రేమ జంట పరిచయం.. వారి మధ్య బంధం మొదలై.. ముగిసే వరకు నడిచే వ్యవహారం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వ్యక్తిత్వం చాటుకునే పాత్రలు పాత్రలు.. వాటికి తగ్గ చక్కటి హీరో హీరోయిన్లు.. ఆహ్లాదంగా సాగిపోయే సన్నివేశాలు.. ఆసక్తి రేకెత్తించే.. ఆలోచింపజేసే మాటలు.. ఫీల్ ను మరింత పెంచే సంగీతం.. ఛాయాగ్రహణం.. అన్నీ కలగలిసి లవ్ ట్రాక్ ను ఆకర్షణీయంగా మార్చాయి. మొదలవడం మామూలుగానే అనిపించినా.. కొంచెం ముందుకు సాగాక ‘తొలి ప్రేమ’ ఆహ్లాదం పంచుతుంది. కాలేజీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు యువతను బాగా ఆకట్టుకుంటాయి. కొన్ని సీన్లు వారికి గిలిగింతలు పెడతాయి. ప్రేమజంట విడిపోవడానికి బలమైన కారణం లేదు కానీ.. ఆ సన్నివేశాన్ని బాగానే డీల్ చేశాడు దర్శకుడు.

ఐతే ప్రథమార్ధం వరకు కొత్తగా అనిపించే ‘తొలి ప్రేమ’ ద్వితీయార్ధంలో మాత్రం రొటీన్ బాట పడుతుంది. చివరికి ఏం జరుగుతుందో అర్థమైపోయాక ఆటోమేటిగ్గా ఆసక్తి సన్నగిల్లిపోతుంది. హీరో హీరోయిన్లు విడిపోవడం.. మళ్లీ కొన్నేళ్ల తర్వాత ఒక చోట అనుకోకుండా కలవడం.. వారిలో ఒకరు ద్వేషిస్తుంటే.. ఇంకొకరు దగ్గరయ్యే ప్రయత్నం చేయడం.. చివరికి అపార్థాలన్నీ తొలగిపోయి ఒక్కటడవడం.. ఇదంతా లెక్కలేనన్ని సినిమాల్లో చూసిన వ్యవహారమే. అందులోనూ వరుణ్ సినిమా ‘ఫిదా’లో ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో ఇదే తరహాలో సాగే కథ చూశాక ఇది మరీ రొటీన్ అనిపిస్తుంది. కాకపోతే అందులో హీరోను హీరోయిన్ ద్వేషిస్తే.. ఇక్కడ హీరోయిన్ని హీరో ద్వేషిస్తాడు. అంతే తేడా. సన్నివేశాలు మాత్రం దాదాపుగా అలాగే సాగుతాయి. కాకపోతే ద్వితీయార్ధంలో మరీ బోర్ కొట్టించేసే సన్నివేశాల్లేవు. ఏదో ఒక మోస్తరుగా సాగిపోతుంటుంది కథనం. ముగింపు దగ్గర మాత్రం ఫీల్ తీసుకురావడంలో మాత్రం వెంకీ విజయవంతమయ్యాడు.

ప్రతికూలతలున్నప్పటికీ ‘తొలి ప్రేమ’ కచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పించే సినిమానే. ప్రేమకథల్ని ఇష్టపడేవారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది. ప్రధాన పాత్రలు.. వాళ్ల మధ్య కెమిస్ట్రీ.. సినిమాలోని కొన్ని అంశాలు అలా గుర్తుండిపోతాయి. ప్రేమకథల్ని పండించడం.. ఫీల్ తీసుకురావడం అంత సులువైన వ్యవహారం కాదు. అది అందరు దర్శకులకూ సాధ్యమయ్యే విషయం కాదు. అందులోనూ ఈ తరంలో అలాంటి దర్శకులు అరుదైపోయారు. వెంకీ అట్లూరి ఈ విషయంలో ప్రత్యేకమైన ముద్ర వేశాడు. రచన దగ్గర్నుంచి.. చిత్రీకరణ వరకు అన్నింట్లోనూ ఒక పరిణతి కనిపిస్తుంది. అతను యువత అభిరుచులకు తగ్గట్లుగా అతను ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు.

నటీనటులు:

వరుణ్ లవర్ బాయ్ పాత్రలో మరోసారి మెప్పించాడు. ప్రేమకథలకు బాగా అలవాటు పడటం వల్లేమో అతడిలో మంచి ఈజ్ కనిపిస్తుంది. ఆది పాత్రలో అతను మెప్పించాడు. ముందు దూకుడైన కుర్రాడిగా.. ఆ తర్వాత వయసుతో పాటు పరిణతి వచ్చిన వ్యక్తిగా అతను ఆకట్టుకున్నాడు. రాశి ఖన్నాకిది కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ కూడా ఆమెదే. ‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత అలాంటి ప్రాధాన్యమున్న పాత్రలో రాశి ఆకట్టుకుంది. తొలిసారి కనిపించినపుడు ఆమె లుక్ ఏమంత బాగా లేదు కానీ.. తర్వాత ఆకట్టుకుంటుంది. నటన పరంగానూ మెప్పించింది రాశి. ప్రియదర్శి పాత్రకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. అతడి నుంచి ఆశించే కామెడీ లేకపోవడం మైనస్. సుహాసిని పాత్రకు తగ్గట్లు నటించింది.

సాంకేతికవర్గం:

ప్రేమకథలకు టెక్నీషియన్ల సపోర్ట్ చాలా కీలకం. సంగీత దర్శకుడు తమన్.. తమిళ సినిమాటోగ్రాఫర్ జార్జ్ సి.విలియమ్స్.. ఆ సపోర్ట్ బాగానే ఇచ్చారు. తాను మంచి ఫీల్ ఉన్న సంగీతం ఇవ్వగలనని ‘మహానుభావుడు’తో రుజువు చేసిన తమన్.. మరోసారి అదే స్థాయి ఔట్ పుట్ తో ఆకట్టుకున్నాడు. దాదాపుగా పాటలన్నీ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఇక జార్జ్ ఈ సినిమా మూడ్ కు తగ్గ కెమెరా పనితనంతో తన వంతుగా సినిమాకు ఫీల్ తీసుకురావడంలో విజయవంతమయ్యాడు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మంచి నిర్మాణ విలువలతో సినిమాకు బలం చేకూర్చాడు. ఇక నటుడిగా పరిచయమై దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరి తొలి సినిమాతోనే ప్రామిసింగ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఒక కొత్త దర్శకుడి నుంచి ఆశించే కొత్తదనం అతను చూపించాడు. ప్రధాన పాత్రల్ని తీర్చిదిద్దడంలో.. సన్నివేశాల్ని ఆహ్లాదంగా నడిపించడంలో తనదైన ముద్ర చూపించాడు. స్క్రిప్టు విషయంలో ఎంతో శ్రద్ధ పెట్టిన విషయం సినిమాలో కనిపిస్తుంది. ద్వితీయార్ధం కొంచెం భిన్నంగా ఉండేలా కసరత్తు చేస్తే బాగుండేది. ఓవరాల్ గా వెంకీ తొలి సినిమాతోనే బలమైన ముద్ర వేశాడు.

చివరగా: తొలి ప్రేమ.. ఫీల్ ఉన్న లవ్ స్టోరీ

రేటింగ్- 3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre