Begin typing your search above and press return to search.

నాలుగు సినిమాల్లో నిలిచేది ఏదో?

By:  Tupaki Desk   |   20 July 2018 5:57 AM GMT
నాలుగు సినిమాల్లో నిలిచేది ఏదో?
X
వేసవిలో భారీ సినిమాల సందడి ముగిశాక చిన్న-మీడియం రేంజ్ సినిమాల జోరు పెరిగింది. పెద్ద సినిమాలు కొంచెం తెరపి ఇవ్వడంతో ప్రతి వారం రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు. ఈ వారం ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. శుక్రవారం ‘లవర్’.. ‘వైఫ్ ఆఫ్ రామ్’.. ‘ఆటగదరా శివ’.. చిత్రాలు విడుదలవుతుంటే.. శనివారం ‘పరిచయం’ రిలీజ్ కానుంది. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా అని ప్రేక్షకులు చూస్తున్నారు.

నిజానికి ఈ నాలుగు చిత్రాలకూ ప్రి రిలీజ్ బజ్ అంతంతమాత్రమే. ఉన్నంతలో ‘లవర్’ పరిస్థితి మెరుగు. ఈ చిత్ర హీరో రాజ్ తరుణ్ హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. అతడి మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. కానీ దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం.. ‘అలా ఎలా’ లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన అనీష్ కృష్ణ దర్శకుడు కావడం దీనికి సానుకూలతలు. యూత్ ఈ చిత్రం వైపు ఆకర్షితులవుతారని భావిస్తున్నారు. ఇక మంచు లక్ష్మి ట్రాక్ రికార్డు ఏంటో తెలిసిందే. అయితే ఆమె సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’ చక్కటి ప్రోమోలతో ఆకట్టుకుంది. కానీ మంచు లక్ష్మి జనాల్ని థియేటర్ల వైపు రప్పించగలుగుతుందా అన్నదే డౌటు.

ఇక చంద్రసిద్దార్థ రూపొందించిన ‘ఆటగదరా శివ’కు నటీనటుల ఆకర్షణ ఏమాత్రం లేదు. అంతా పేరు లేని వాళ్లే నటించారు. దర్శకుడి ట్రాక్ రికార్డూ బాగా లేదు. కాకపోతే ఇది కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. ప్రోమోలు ఆకట్టుకున్నాయి. ఇక కొత్త హీరో హీరోయిన్లతో లక్ష్మీకాంత్ చెన్నా రూపొందించిన ‘పరిచయం’.. కూడా టీజర్ ట్రైలర్లతోనే ఆకర్షించింది. కానీ ఈ చిన్న సినిమా కూడా ప్రేక్షకుల్ని థియేటర్ల వరకు రప్పించగలదా అన్నదే డౌటు. వీటిలో ఏ సినిమాకూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఓపెనింగ్స్ రాకపోవచ్చు. కానీ టాక్ బాగుంటే జనాలు థియేటర్లకు కదులుతారు. మరి దేనికి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.