Begin typing your search above and press return to search.

అది కరోనా కన్నా డేంజర్‌ అంటున్న స్టార్‌ హీరో

By:  Tupaki Desk   |   17 March 2020 10:15 AM IST
అది కరోనా కన్నా డేంజర్‌ అంటున్న స్టార్‌ హీరో
X
కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ నటించిన మాస్టర్‌ చిత్రం ఆడియో వేడుక వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ రాకున్నా కూడా సినీ ఇండస్ట్రీలో మాస్టర్‌ చిత్రం ఆడియో విడుదల వేడుక చర్చనీయాంశంగా మారింది. ఆ వేడుకలో విజయ్‌ డాన్స్‌ తో పాటు ఫన్నీ.. ఎమోషనల్‌ స్పీచ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక మాస్టర్‌ లో కీలక పాత్ర పోషించిన విజయ్‌ సేతుపతి స్పీచ్‌ కూడా తమిళ సినీ వర్గాల్లో మరియు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ మొదట కరోనా వైరస్‌ గురించి భయం అక్కర్లేదని.. ముందు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా నుండి మీకు మీరు కాపాడుకోవచ్చు. కరోనా అంటూ భయపడి మానసిక ప్రశాంతత లేకుండా చేసుకోకండి. నా కుటుంబ సభ్యులకు ఇదే నేను ఇచ్చే సలహా. మీరు కూడా ఇలాగే మీ కుటుంబ సభ్యులకు చెప్పండంటూ ఫ్యాన్స్‌ కు సూచించాడు. కరోనాపై మానసికంగా దృడంగా ఉండటం వల్లే పోరాటం సాగించగలమని విజయ్‌ సేతుపతి అన్నాడు.

దేశంలో ప్రస్తుతం దేవుడి పేరును చెప్పి కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నా దేవుడు గొప్ప అంటూ వాదించే వారిని వదిలేయండి. వారితో వాదించేందుకు ప్రయత్నించవద్దు. అలాంటి వారు కరోనా వైరస్‌ కంటే డేంజర్‌. వారికి దేవుడు కంటే కూడా మానవత్వం గొప్పది అనే విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నించండి. ప్రతి ఒక్కరితో సోదర భావంతో మెలగాల్సిన అవసరాన్ని వివరించండి. అంతే తప్ప దేవుడు గొప్ప అంటూ ప్రచారం చేసే వారికి మద్దతు ఇవ్వకండి అంటూ ఇండైరెక్ట్‌ గా మతతత్వ పార్టీలకు చురకలు అంటించాడు.