Begin typing your search above and press return to search.

అదే 'అన్నాత్తే' స్పెషాలిటీ!

By:  Tupaki Desk   |   2 Jan 2021 5:00 AM IST
అదే అన్నాత్తే స్పెషాలిటీ!
X
రజనీకాంత్ .. సినిమాల పరంగా ప్రపంచాన్ని ఏకం చేసిన పేరు. భాషతో .. ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు అభిమానించే పేరు. రజనీకాంత్ ఒక్క సినిమా .. పది పండగల పెట్టు. ఆయన ప్రతి సినిమా కాసుల గలగలలు వినిపించే గోదారి గట్టు. 'కబాలి' సినిమా నుంచి రజనీ తన లుక్ కి మరింత ప్రత్యేకతనిస్తూ వస్తున్నారు. 'కాలా' .. 'పేట' .. 'దర్బార్' సినిమాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి. సాధారణంగా రజనీ సినిమాలన్నీ కూడా యాక్షన్ - ఎమోషన్ ప్రధానాస్త్రాలుగా సాగుతుంటాయి. అదే తరహాలో ఆయన తాజా చిత్రమైన 'అన్నాత్తే' రూపొందుతోంది.

'శివ' దర్శకత్వంలో .. కళానిథి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమాలో ఖుష్బూ .. మీనా .. నయనతార నటిస్తున్నారు. ఈ ముగ్గురి పాత్రలు దేనికదే ప్రత్యేకంగా అనిపిస్తాయని అంటున్నారు. గతంలో రజనీ సరసన 'ఖుష్బూ' హీరోయిన్ గా అలరించింది. అలాగే 'మీనా' కూడా రజనీ జోడీగా ఆకట్టుకుంది. ఇక 'నయనతార' కూడా రజనీ నాయికగా మెప్పించింది. అలాంటి ఈ ముగ్గురూ కలిసి ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం.

ఇక దర్శకుడు 'శివ' విషయానికే వస్తే .. హీరోయిజాన్ని ఒక రేంజ్ లో చూపించడంలో ఆయన సిద్ధహస్తుడు. యాక్షన్ .. ఎమోషనల్ సీన్స్ ను అద్భుతంగా ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. గతంలో ఆయన 'అజిత్' హీరోగా తెరకెక్కించిన 'వీరమ్' .. 'వేదాళం' .. 'వివేగం' .. 'విశ్వాసం' సినిమాలు అందుకు నిదర్శనం. ఈ సినిమాలన్నీ కూడా అక్కడ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అలాంటి శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై, సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. ఇమాన్ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఈ సినిమా సంచలనానికి సరికొత్త అర్థం చెబుతుందేమో చూడాలి.