Begin typing your search above and press return to search.

సినిమా సంబరాల బడ్జెట్‌ను ఇలా మళ్లించాడు

By:  Tupaki Desk   |   15 May 2021 12:30 AM GMT
సినిమా సంబరాల బడ్జెట్‌ను ఇలా మళ్లించాడు
X
బాలీవుడ్లో సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న బేన‌ర్ల‌లో య‌శ్ రాజ్ ఫిలిమ్స్ ఒక‌టి. భారతీయ సినిమా పరిశ్రమంలో 50 ఏళ్ల ఘ‌న ప్ర‌స్థానం ఆ సంస్థ‌ది. 1970లో దర్శక నిర్మాత యశ్ చోప్రా ఈ సంస్థను మొదలుపెట్టాడు. గత ఏడాదితో దానికి 50 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఏడాది పాటు 50వ వార్షికోత్సవ సంబరాలకు ప్రణాళికలు రూపొందించాడు సంస్థ అధినేత, యశ్ చోప్రా తనయుడు ఆదిత్య చోప్రా. ఇందుకోసం భారీగా బడ్జెట్ కూడా కేటాయించాడు. దీంతో పాటు ఈ ఏడాది వ్యవధిలో తమ సంస్థలో తెరకెక్కుతున్న కొత్త చిత్రాలను వరుసగా రిలీజ్ చేయడానికి కూడా ప్రణాళికలు రచించారు.

కానీ కరోనా మహమ్మారి ఆ ప్రణాళికలన్నింటినీ దెబ్బ కొట్టింది. యశ్ రాజ్ సంస్థ నుంచి సినిమాలు ఆగిపోయాయి. ఇక 50వ వార్షికోత్సవ సంబరాలను కూడా సరిగా జరుపుకోలేని పరిస్థితి తలెత్తింది. కొన్ని నెలల కిందట కరోనా ప్రభావం తగ్గి నార్మల్సీ దిశగా అడుగులు పడుతుండటంతో కొత్తగా ఈ ఏడాది సంస్థ నుంచి ఐదు సినిమాల రిలీజ్ డేట్లను అనౌన్స్ చేయడంతో పాటు 50వ వార్షికోత్సవ సంబరాలను భారీ ఎత్తున నిర్వహించాలని ఆదిత్య చోప్రా నిర్ణయించాడు. కానీ మళ్లీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఈ ప్రణాళికలు దెబ్బ తిన్నాయి. సినిమాల రిలీజ్ సంగతి అయోమయంలో పడింది.

ఐతే ఈ కష్ట కాలంలో ఆదిత్య చోప్రా ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ 50వ వార్షికోత్సవ సంబరాలకు కేటాయించిన కోట్ల రూపాయల బడ్జెట్‌ను మంచి పనుల కోసం మళ్లించాడు. ఈ డబ్బులతో యశ్ రాజ్ కిచెన్ పేరుతో ఒక హోటల్ మొదలుపెట్టి ముంబయి, గుర్గావ్‌ల్లో పలు ప్రాంతాల్లో కోవిడ్ నియంత్రణ కోసం కష్టపడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు, క్వారంటైన్ సెంటర్లలో కరోనాతో పోరాడుతున్న రోగులకు ఈ సంక్షోభ సమయం ముగిసేంత వరకు మూడు పూటలా భోజనం పెట్టాలని నిర్ణయించారు. అలాగే ‘యశ్ చోప్రా సాథి’ పేరుతో ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేసి అందులో దరఖాస్తు చేసుకున్న సినీ కార్మికులకు ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నారు. అందరూ సోనూ సూద్ స్థాయిలో సాయం చేయలేరు కానీ.. తమకు కుదిరిన మేర ఇలా కరోనా బాధితులు, పోరాట యోధులకు సాయపడటం అభినందనీయం.