Begin typing your search above and press return to search.

ఈ చిన్నారి నిన్నటి స్టార్ హీరోయిన్ .. నేటి ఫైర్ బ్రాండ్!

By:  Tupaki Desk   |   17 Nov 2021 9:30 AM GMT
ఈ చిన్నారి నిన్నటి స్టార్ హీరోయిన్ .. నేటి ఫైర్ బ్రాండ్!
X
ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే వినోద సాధనం సినిమా. అందువల్లనే సినిమాల్లో నటించే స్టార్స్ పట్ల సహజంగానే అభిమానం పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ స్టార్స్ గురించి తెలుసుకోవాలనిపించడానికీ .. వాళ్ల వ్యక్తిగత విషయాల పట్ల ఆసక్తి పెరగడానికి కారణం ఆ అభిమానమే. అలాంటి స్టార్స్ చిన్నప్పటి ఫోటోలు చూసినప్పుడు ఒక రకమైన ఆనందం కలగడం సహజం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత అభిమానులకు ఇలాంటి అవకాశాలు ఎక్కువగా దక్కుతున్నాయి. సినిమా స్టార్స్ చిన్ననాటి ఫోటోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగానే సందడి చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే నిన్నటితరం స్టార్ హీరోయిన్ .. నేటి రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నిన్నటితరం స్టార్ హీరోయిన్ అంటే కనుక్కోవడం కాస్త కష్టమే. కానీ నేటి రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ అనగానే 'రోజా' అని వెంటనే చెప్పేస్తారు. అవును ఈ ఫోటోలో బోసినవ్వులతో కనిపిస్తున్నది చిన్నారి 'శ్రీలత'నే. తిరుపతిలో పుట్టిపెరిగిన శ్రీలత .. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకుని 'రోజా' అయ్యారు. ఈ రోజున ఆమె పుట్టినరోజు. ఈ రోజున ఆమె 49వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు సన్నిహితులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో రోజా నటించారు. తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. 'సర్పయాగం' సినిమాతో టాలీవుడ్ లో ఆమె ప్రయాణం మొదలైంది. రోజా కళ్లు .. ఆమె నవ్వు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఆమె ఎక్కువ సమయం తీసుకోలేదు. 'సీతారత్నంగారి అబ్బాయి' సినిమాతో కథానాయికగా ఆమె తొలి హిట్ ను అందుకున్నారు. ఆ తరువాత చిరంజీవి సరసన చేసిన 'ముఠామేస్త్రీ' .. బాలకృష్ణ జోడీగా చేసిన 'భైరవ ద్వీపం' సినిమాలు ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టాయి.

ఇక ఆ తరువాత 'బొబ్బిలి సింహం' .. 'శుభలగ్నం' మొదలైన సినిమాలు ఆమె దూకుడు కొనసాగేలా చేశాయి. సౌందర్య .. రంభ వంటి కథానాయికల పోటీని తట్టుకుని, తనదైన ప్రత్యేకతను చాటుకున్న నాయికగా రోజా కనిపిస్తుంది. ఆ తరువాత నెమ్మదిగా ఆమె సినిమాలకు దూరమవుతూ .. రాజకీయాలకు చేరువవుతూ వచ్చారు. సినిమాల్లో హీరోయిన్ గా చేసి వచ్చారు కనుక ఆమె చాలా సెన్సిటివ్ అని చాలామంది అనుకున్నారు. చేతిలో స్క్రిప్ట్ లేకపోతే ఏమీ మాట్లాడలేదని చెప్పుకున్నారు. కానీ అలాంటివారి అంచనాలు తారుమారు కావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ప్రస్తుతం రాజకీయాల్లో ఆమె ఫైర్ బ్రాండ్ గానే కొనసాగుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న రోజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం.