Begin typing your search above and press return to search.

థ‌ర్డ్ వేవ్ దెబ్బ‌కి ఓటీటీకి జైకొట్టేస్తున్నారు

By:  Tupaki Desk   |   7 Jan 2022 7:30 AM GMT
థ‌ర్డ్ వేవ్ దెబ్బ‌కి ఓటీటీకి జైకొట్టేస్తున్నారు
X
దేశ వ్యాప్తంగా థ‌ర్డ్ వేవ్ ఊపందుకుంటోంది. ఎక్క‌డ చూసినా.. ఏ రాష్ట్రం గురించి తెలుసుకున్నా కోవిడ్‌, ఒమిక్రాన్ వార్త‌లే అత్య‌ధికంగా వినిపిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో వారాంత‌పు క‌ర్ఫ్యూలని విధించిన విష‌యం తెలిసిందే. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి వ‌చ్చేసింది. అది క్ర‌మ క్ర‌మంగా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు విస్త‌రిస్తోంది. అంతే కాకుండా థ‌ర్డ్ వేవ్ ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభించ‌డం మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన రెండు పాన్ ఇండియా చిత్రాలు వాయిదా ప‌డ‌టం.. ఆ క్ర‌మంలో చాలా చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించేశాయి. జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 14 భాష‌ల్లో `RRR`ని విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశారు రాజ‌మౌళి. కానీ తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ మూవీని వాయిదా వేయ‌డం తెలిసిందే. ఇక ఇదే మూవీ త‌రహాలో జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానున్న `రాధేశ్యామ్‌` ని కూడా పోస్ట్ పోన్ చేశారు. దీంతో `బంగార్రాజు`తో పాటు చిన్న సినిమాలు చాలా వ‌ర‌కు సంక్రాంతి సీజ‌న్ టార్గెట్ చేసుకున్నారు.

ప‌దికి పైగా చిత్రాలు రిలీజ్ కు రెడీ అయిపోయి డేట్ లు కూడా ప్ర‌క‌టించేశాయి. అయితే ఇలా రిలీజ్‌లు ప్ర‌క‌టించిన చిత్రాల్లో దాదాపు 10 చిత్రాల వ‌ర‌కు థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుండ‌గా మ‌రికొన్ని చిత్రాలు ఓటీటీ బాట ప‌ట్ట‌బోతున్నాయి. థ‌ర్డ్ వేవ్ నేప‌థ్యంలో చాలా మంది యువ నిర్మాత‌లు ఓటీటీ రిలీజ్‌ల‌కే మొగ్గుచూపుతున్నారు. థియేట‌ర్ల‌కు జ‌నాలు ఇప్పుడ‌ప్పుడే వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఓటీటీకే జై కొడుతున్నార‌ట‌.

మీడియం రేంజి సినిమాల్ని థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్ ఓటీటీ ప‌ద్ద‌తిలో రిలీజ్ చేస్తే మంచిద‌ని చాలా మంది యువ నిర్మాత‌లు, కొత్త ప్రొడ్యూస‌ర్లు వ‌చ్చిన‌ట్టుగా ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. ఓటీటీలు కూడా కంటెంట్ గుడ్ అని తేలిన సినిమాల‌కు భారీ ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. దీంతో చాలా మంది థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసి రిస్క్ చేయ‌డం కంటే ఓటీటీకే ఇచ్చేయ‌డం ప్ర‌స్తుతం సేఫ్‌ అని గ‌ట్టి నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు చెబుతున్నారు. దీంతో ఓటీటీల్లో వ‌రుస సినిమాల జాత‌ర ప్రారంభం కాబోతోంది.