Begin typing your search above and press return to search.

'టక్ జగదీష్' చిత్రంలో అవి హైలైట్ గా నిలుస్తాయట..!

By:  Tupaki Desk   |   6 April 2021 2:30 AM GMT
టక్ జగదీష్ చిత్రంలో అవి హైలైట్ గా నిలుస్తాయట..!
X
నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''టక్ జగదీష్''. రీతూ వర్మ - ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఉగాదికి ట్రైలర్ రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రంలో ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్స్‌ చెప్పబోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే డైరెక్టర్ శివ నిర్వాణ తన కెరీర్‌ లో మళ్లీ ఇలాంటి ఓ ఫ్యామిలీ డ్రామాను తీస్తానో లేదో అని.. అందుకే అన్ని ఎమోషన్స్‌ ను ఈ సినిమాలో చూపించానని చెప్పుకొచ్చాడు. దీనికి తగ్గట్టుగానే అన్నదమ్ములు జగపతిబాబు - నాని మధ్య సీన్స్ అందరికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయని టాక్. ముఖ్యంగా సెకండాఫ్ లో వీరిద్దరి మధ్య వచ్చే రైన్ ఎమోషనల్ సీక్వెన్స్ ఒకరి హైలైట్ గా నిలవనుందట. అలానే చివరి 30 నిమిషాలలో ఫ్యామిలీ డ్రామాతో పాటుగా యాక్షన్ పార్ట్ మరో హైలైట్ అని అంటున్నారు. అలానే థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ - శివ నిర్వాణ డైలాగ్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయట.

ఇకపోతే 'టక్ జగదీష్' టైటిల్ కి తగ్గట్టే నాని ఈ సినిమా అంతటా టక్‌ లుక్‌ లోనే కనిపిస్తారు. దీని వెనుక కూడా ఓ కథ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఫైనల్ కట్ చూసుకున్న చిత్ర యూనిట్.. బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రంలో డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ తదితరులు నటించారు. నాని కెరీర్ లో 26వ చిత్రంగా వస్తున్న 'టక్ జగదీష్' ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.