Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంటే బరిలో నిలిచే సినిమాలు ఇవే...!

By:  Tupaki Desk   |   16 May 2020 5:30 PM GMT
ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంటే బరిలో నిలిచే సినిమాలు ఇవే...!
X
పండగ సీజన్ లో తమ సినిమాలని రిలీజ్ చేసుకోవాలని ప్రతీ హీరో దర్శక నిర్మాత కోరుకుంటారు. ఎందుకంటే పండగకి అయితే సినిమా కలెక్షన్స్ ఓ రేంజ్ లో రాబట్టే అవకాశం ఉంటుంది. సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా వసూళ్ల పరంగా మంచి సినిమాగా నిలుస్తుంది. దీని కోసం దర్శక నిర్మాతలు పోటీపడి మరీ సినిమాలను ఫెస్టివల్ కి వచ్చేలా ప్లాన్ చేస్తారు. ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే సినిమా పండుగ అని చెప్పొచ్చు. కొత్త సినిమాలతో థియేటర్స్ అన్నీ కళ కళలాడుతుంటాయి. ప్రతి ఏడాది ఓ అరజడను సినిమాలు థియేటర్స్‌ లో సందడి చేస్తుంటాయి. ఈ ఏడాది కూడా రిలీజైన నాలుగు సినిమాలలో మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. దీంతో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఏర్పడింది.

ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కోసం జక్కన్న కర్చీఫ్ వేసేశాడు. అప్పటికే రెండుసార్లు వాయిదా పడిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా సంక్రాంతి కానుకగా 2021 జనవరి 8కి విడుదల చేయబోతున్నామంటూ రాజమౌళి పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించేశాడు. జక్కన్న సినిమా వస్తుందంటే నాలుగు వారాలు దగ్గర్లో మరో సినిమా తీసుకురావడానికి ఆలోచిస్తూ ఉంటారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలు ఏవీ సంక్రాంతికి రిలీజ్ ప్రకటించకుండా బరిలో నుండి తప్పుకున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా షూటింగ్ పూర్తిగా నిలిపి వేయడం జరిగింది. మళ్లీ తిరిగి షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మూవీ షూటింగ్స్ డిలే అయితే సినిమా రిలీజ్ డేట్స్ కూడా ఖచ్చితంగా వాయిదా పడతాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తాజాగా సంక్రాంతికి కూడా ఆర్.ఆర్.ఆర్ వచ్చేది కష్టమే అని నిర్మాత దానయ్య డౌట్ వ్యక్తం చేసాడు. 30 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి పరిస్థితులలో పూర్తి చేయడం చాలా కష్టం అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. జనవరి 8వ తేదీన మూవీని విడుదల చేయాలని అన్నివిధాలా ప్రయత్నిస్తున్నాం కానీ లాక్‌ డౌన్ కారణంగా ప్లానింగ్ దెబ్బతిందని ఆయన ప్రకటించడంతో విడుదల తేదీ మారబోతోందని అర్థం అవుతోంది. దీంతో మరో మూడు నాలుగు నెలలు 'ఆర్ ఆర్ ఆర్' విడుదల వాయిదా పడే అవకాశముందని తెలుస్తుంది. ఇప్పుడు జక్కన్న సినిమా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని తెలియయడంతో పెద్ద సినిమాలు అన్నీ ఇప్పుడు ఛాన్స్ తీసుకోడానికి ట్రై చేస్తున్నాయి. మూడు పెద్ద చిత్రాలు సంక్రాంతి బెర్త్ కన్ఫామ్ చేసుకునేందుకు రెడీ అయ్యాయి. వాటిలోని ప్రభాస్ - చిరంజీవి - బాలయ్య సినిమాలు ఉన్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ మేజర్ పార్ట్ షూట్ అయ్యింది. లాక్ డౌన్ వల్ల మిగతా షూటింగ్‌ కి బ్రేక్ పడింది. అయితే ఈ సినిమాను దసరా లేదా దీపావళి విడుదల చేయడానికి ప్లాన్ చేసారు. ఇప్పుడు ఎలాగూ సంక్రాంతి రేస్ నుంచి ఆర్ ఆర్ ఆర్ తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుండటంతో ‘ఆచార్య’ సంక్రాంతి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ ఆర్.ఆర్.ఆర్. హీరో రామ్ చరణ్ 'ఆచార్య' ప్రొడ్యూసర్ కావడంతో ఈ ప్లేస్ కోసం ఆయన గట్టిగానే ట్రై చేసే అవకాశాలున్నాయి. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'జిల్' ఫేమ్ రాధాక్రిష్ణతో ఓ పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా చాలా భాగం షూటింగ్ పూర్తి కావడంతో వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బాలయ్య సినిమా సంక్రాంతికి వచ్చిందంటే పక్కా హిట్ అనే సెంటిమెంట్ ఉండటంతో తనకు బాగా కలిసి వచ్చిన బోయపాటితో తీస్తున్న సినిమాని సంక్రాంతి బరిలో నిలిపే అవకాశం ఉంది. మొత్తానికి జక్కన్న వచ్చే సంక్రాంతికి రాకపోతే ఈ ముగ్గురు స్టార్ హీరోలు పోటీ పడనున్నారని చెప్పవచ్చు.