Begin typing your search above and press return to search.

ఈ ఏడాది హిట్టు పట్టేసిన కుర్ర హీరోలు వీరే!

By:  Tupaki Desk   |   27 Dec 2021 4:13 PM IST
ఈ ఏడాది హిట్టు పట్టేసిన కుర్ర హీరోలు వీరే!
X
చిత్రపరిశ్రమలోకి అనునిత్యం అనేక మంది అడుగుపెడుతూనే ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ ప్రతిభా పాటవాలను నిరూపించే అవకాశాల కోసం అలా తిరుగుతూనే ఉంటారు. అందువలన ఇక్కడ గట్టిపోటీ ఉంటుంది. అవకాశాన్ని అందుకోవడమే చాలా కష్టమైతే, అలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మరింత కష్టం. ఆ కష్టానికి అదృష్టం కూడా తోడై సక్సెస్ అనేది రావడం ఇంకా కష్టం. అంటే ఒక రేంజ్ కి వెళ్లెవరకూ ఇలా టెన్షన్ పడుతూనే ఉండాలి .. అపజయాలను తప్పించుకుని తిరుగుతూనే ఉండాలి.

సాధారణంగా బలమైన సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారికి తమని తాము నిరూపించుకోవడానికి కాస్త సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చినవారు మాత్రం సాధ్యమైనంత త్వరగా హిట్ ను వెతికి పట్టుకోవలసిందే. లేదంటే ఆశల నుంచి .. ఆశయం నుంచి జారిపోవలసి వస్తుంది. అలా కాకుండా తమ ప్రయత్నాలు ఫలించి మంచి హిట్ పడినప్పుడు వాళ్లకి అవకాశాలు పెరుగుతాయి .. తమని తాము మరింత నిరూపించుకోవాలనే పట్టుదల కూడా వారి నమ్మకానికి తోడవుతుంది.

అలాంటి ఒక పట్టుదలతో ఈ ఏడాది కొందరు కుర్ర హీరోలు గట్టి హిట్లే కొట్టారు. ఈ జాబితాలో ముందుగా మనకి వైష్ణవ్ తేజ్ కనిపిస్తాడు. 'ఉప్పెన' సినిమాతో ఈ కుర్రాడు ఈ ఏడాదిలోనే హీరోగా పరిచయమయ్యాడు. వచ్చింది మెగా ఫ్యామిలీ నుంచే అయినా, ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ రోల్ ఎంచుకుని రంగంలోకి దిగాడు. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆయనకి బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చింది. కృతి శెట్టి గ్లామర్ ఈ సినిమా సక్సెస్ విషయంలో ప్రధానమైన పాత్రను పోషించింది. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉండటం విశేషం.

ఇక సంతోష్ శోభన్ విషయానికొస్తే .. 'ఏక్ మినీ కథ' .. 'మంచి రోజులు వచ్చాయి' వంటి రెండు మంచి సినిమాలు పడ్డాయి. బడ్జెట్ పరంగా చిన్న సినిమాలే అయినా, ఆయనకి మంచి పేరును తీసుకొచ్చాయి .. పెద్ద బ్యానర్లలో అవకాశాలను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదే ఏడాదిలో వచ్చిన ఆకాష్ పూరి 'రొమాంటిక్' మంచి ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టింది. హిట్టు దగ్గరలోకి వెళుతూ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం 'చోర్ బజార్' చేస్తూ, తరువాత ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు.

ఇక తేజ సజ్జ ఈ ఏడాది తన దూకుడు బాగానే చూపించాడు. మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ జాబితాలో 'జాంబీ రెడ్డి' మంచి హిట్ అయింది. ఆ ఉత్సాహంతో ఆయన గేరు మార్చే పనిలో ఉన్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'హనుమాన్' చేస్తున్నాడు. ఇక ఈ ఏడాది 'జాతిరత్నాలు' తో నవీన్ పోలిశెట్టి పెద్ద హిట్ కొట్టాడు. ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమాల్లో ఇది ఒకటి. ఈ సినిమా తరువాత ఆయన సితార - యూవీ బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఈ ఏడాదిలో తలో హిట్టు పట్టుకుని, కుర్ర హీరోలు తమ దూకుడు పెంచడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ రేసులో ఎవరు ముందుంటారనేది చూడాలి.