Begin typing your search above and press return to search.

కొత్త రికార్డులను సెట్ చేసిన మెగా మూవీలు ఇవే!

By:  Tupaki Desk   |   23 April 2022 11:30 PM GMT
కొత్త రికార్డులను సెట్ చేసిన మెగా మూవీలు ఇవే!
X
తెలుగు తెరపైకి చాలామంది హీరోలు వస్తుంటారు .. వెళుతుంటారు. ఎవరి ప్రత్యేకత వారిది .. ఎవరి స్టైల్ వారిది. అయితే చిరంజీవి విషయానికి వస్తే మాత్రం మరింత ప్రత్యేకంగా చెప్పుకోవలసిందే. ఎందుకంటే తెలుగు తెరపై చిరంజీవి చూపించిన స్పీడ్ వేరు. అప్పటివరకూ నడుస్తూ వచ్చిన ట్రెండును ఆయన ఒక్కసారిగా పరుగులు తీయించారు. డాన్సులలోను .. ఫైట్లలోను కొత్తదనాన్ని తీసుకుని వచ్చారు. ముఖ్యంగా తనదైన స్టైల్ తో కట్టిపడేసారు. మాస్ హీరోయిజం ఎలా ఉంటుందనేది ఆయన రుచి చూపించారు.

ప్రతి హీరోకి కెరియర్ ఆరంభంలో ఒక చెప్పుకోదగిన సినిమా ఉంటుంది. అలా చూసుకుంటే చిరంజీవి కెరియర్లో 'ఖైదీ' కనిపిస్తుంది. చిరంజీవిని యాక్షన్ హీరోగా ఆవిష్కరించిన సినిమా ఇది. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 3.75 కోట్ల షేర్ ను సాధించింది.

రావు గోవుపాలరావు విలనిజం .. చక్రవర్తి సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకుని వెళ్లాయి. ఇక 1987లో వచ్చిన 'పసివాడి ప్రాణం' మరోసారి చిరంజీవి గ్రాఫ్ ను పైకి లేపింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా 4.75 కోట్ల షేర్ ను రాబట్టింది. 1988లో వచ్చిన 'యముడికి మొగుడు' సినిమాతో ఆయన 5 కోట్ల షేర్ మార్కును అందుకున్నారు.

చిరంజీవికి మాస్ ఆడియన్స్ నుంచి మరిన్ని మార్కులు తెచ్చిపెట్టిన సినిమాల్లో 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' ఒకటి. 1989లో వచ్చిన ఈ సినిమా కూడా చిరంజీవి ఇచ్చిన ఇండస్ట్రీ హిట్ లలో ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమా 5.25 కోట్ల షేరును తెచ్చిపెట్టింది. ఆ తరువాత చెప్పుకోవలసిన సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఈ సినిమా చిరంజీవి సక్సెస్ గ్రాఫ్ ను ఎక్కడికో తీసుకునిపోయింది. 1990లోనే 6 కోట్ల షేర్ మార్కును సాధించి చిరంజీవి రేంజ్ ను ఈ సినిమా చాటిచెప్పింది. ఇక ఆ తరువాత వచ్చిన 'గ్యాంగ్ లీడర్' సినిమా సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు.

'గ్యాంగ్ లీడర్' సినిమా 1991లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయబాపినీడు దర్శకత్వం వహించిన ఈ సినిమా, కథాకథనాల పరంగానే కాకుండా, మ్యూజికల్ హిట్ గా కూడా నిలిచింది. 7 కోట్ల షేర్ ను రాబట్టింది. 1992లో వచ్చిన 'ఘరానా మొగుడు' 10 కోట్లషేర్ ను నమోదు చేసి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరిచింది.

కీరవాణి సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. ఇక బి. గోపాల్ దర్శకత్వం వహించిన 'ఇంద్ర' సినిమా, 29 కోట్ల షేర్ ను వసూలు చేసి, కొత్త రికార్డులను నమోదు చేసింది. అలుపనేది లేకుండా ఇంకా ఇండస్ట్రీ హిట్ లను ఇచ్చే ఉద్దేశంతోనే చిరూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండటం విశేషం.