Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడిని ఎగతాళి చేసిన ఆర్టిస్టులెవరు?

By:  Tupaki Desk   |   16 March 2020 11:00 PM IST
అనిల్ రావిపూడిని ఎగతాళి చేసిన ఆర్టిస్టులెవరు?
X
అనిల్ రావిపూడి.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కమర్షియల్ డైరెక్టర్లలో ఒకడు. అతడి ప్రతి సినిమా సూపర్ హిట్టే. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’తో టాప్ డైరెక్టర్ల లీగ్‌లోకి చేరిపోయాడు. ఇప్పుడు అతడి తో సినిమా చేయడానికి పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతలు లైన్లో ఉన్నారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లు అతడి వైపు ఎలా ఆశగా చూస్తుంటారో చెప్పాల్సిన పని లేదు. ఐతే అనిల్ ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చిన్న సినిమాలకు పని చేసి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ సమయం లో అవమానాలు కూడా తప్పలేదట. రైటర్‌గా ఉన్నపుడు తనను చాలా తక్కువగా చూసేవారంటూ అతను తన అనుభవాల్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. తాను గోపీచంద్ నటించిన ‘శౌర్యం’ సినిమాకు రచయితగా పని చేశానని.. కానీ ఆ సినిమాకు తన పేరు పడలేదని.. దీంతో హిట్ అయినా కూడా పేరు రాలేదని.. కానీ ‘శంఖం’ అనే ఫ్లాప్ సినిమాకు పేరు పడ్డా ఆ చిత్రం ఫ్లాప్ కావడం తో నిరాశ తప్పలేదని అతను చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే.. ‘శంఖం’ సినిమాకు రచయితగా పని చేస్తుండగా.. సెట్స్‌లో ఇద్దరు ఆర్టిస్టులకు సీన్ చెప్పడానికి వెళ్లానని.. అప్పుడు ఆ ఇద్దరూ తన గురించి చాలా తేలిగ్గా మాట్లాడారని అనిల్ గుర్తు చేసుకున్నాడు. తాను రైటర్‌నని చెప్పగా.. ‘‘అదండీ.. ప్రతి వాడూ చేతిలో పెన్ను, పేపర్ పట్టుకుని రైటర్ అని చెప్పి వచ్చేస్తారు. డైలాగులేమో ఇలా ఉంటాయి. మనం ఇంప్రొవైజ్ చేసి చెప్పాలి. ఇంకా ఏమవుదామనుకుంటున్నావు’ అని వాళ్లిద్దరూ అన్నారని.. తాను డైరెక్టర్ కావాలనుకుంటున్నట్లు చెప్పగా.. ‘వీడు డైరెక్టర్ కూడా అవుతాడట’ అంటూ పది నిమిషాల పాటు తన తో ఎగతాళిగా మాట్లాడుతూ కామెడీ చేసినట్లు అనిల్ చెప్పుకొచ్చాడు. ఎప్పుడైనా వాళ్లు తన సినిమా లో చేయకపోతారా అనుకున్నానని.. ఐతే ఆ ఇద్దరూ ఇప్పటిదాకా తన తో పని చేయలేదని అనిల్ తెలిపాడు.