Begin typing your search above and press return to search.

ఆ సినిమాను బస్సులో వేశారు

By:  Tupaki Desk   |   18 April 2016 9:50 AM GMT
ఆ సినిమాను బస్సులో వేశారు
X
పైరసీ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందన్న విషయం తాజా ఘటన చెప్పకనే చెప్పేస్తుంది. శుక్రవారం సినిమా థియేటర్లలో విడుదలైతే.. ఆ సినిమాను శనివారం బాహాటంగా ఏసీ బస్సులో వేసేసిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ తాజాగా నటించిన తమిళ చిత్రం ‘తెరి’. ఇదే సినిమాను తెలుగులో పోలీస్ గా విడుదల చేశారు. విజయ్ కూతురిగా ప్రముఖ నటి మీనా కుమార్తె నటించటం.. ఆ చిన్నారి నటన అదిరిపోయిందన్న వార్తలు వస్తున్న వేళ.. ఈ సినిమాను తిరుచ్చి నుంచి తంజావూరుకు వెళ్లే ఓ ఏసీ బస్సులో వేయటం షాకింగ్ గా మారింది.

సినిమా రిలీజ్ అయిన రోజులోనే పైరసీ సీడీ రావటం ఒక ఎత్తు అయితే.. ఆ సినిమాను బస్సులో వేయటం సంచలనం సృష్టించింది. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న విజయ్ అభిమాని కడుపు మండిపోయింది. జరుగుతున్న దారుణాన్ని తంజావూరులోని తమ వాళ్లకు ఫోన్ చేసి చెప్పాడు. అంతే.. బస్సు తంజావూరుకు చేరుకున్న వెంటనే బస్సును చుట్టు ముట్టిన విజయ్ అభిమానులు బస్సును తనిఖీ చేసి.. అందులో సినిమా సీడీని స్వాధీనం చేసుకున్నారు. సినిమా విడుదలైన ఒక్క రోజులోనే సీడీ బస్సులో ప్రసారం అయిన తీరుపై విజయ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.