Begin typing your search above and press return to search.

మన ప్రతి సినిమాపై వారి కన్ను

By:  Tupaki Desk   |   4 July 2021 1:30 PM GMT
మన ప్రతి సినిమాపై వారి కన్ను
X
ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాలతో సౌత్‌ సినిమాలు ఏమాత్రం పోటీ పడేవి కావు. ఆ సినిమాల బడ్జెట్ నుండి మొదలుకుని కథ వరకు ప్రతి విషయంలో కూడా బాలీవుడ్ హై స్టాండర్డ్ ను మెయింటెన్ చేసేవి. అప్పట్లో చాలా తక్కువ సౌత్‌ సినిమాలు మాత్రమే ఉత్తరాదిన రీమేక్ అయిన దాఖలాలు ఉన్నాయి. కాని ఇప్పుడు మాత్రం సౌత్ సినిమాలు బాలీవుడ్‌ సినిమాలకు ఏమాత్రం తీసి పోవడం లేదు. కొన్ని సినిమాలు బాలీవుడ్‌ రేంజ్‌ ను కూడా మించాయి అనడంలో సందేహం లేదు. సౌత్‌ లో రూపొందిన రోబో.. బాహుబలి.. సాహో వంటి సినిమాలు బాహుబలి సినిమాలను మించి వసూళ్లు సాధించాయి. ఇక తెలుగు లో తెరకెక్కించిన పలు సినిమాలు ఈమద్య కాలంలో హిందీలో రీమేక్ అవుతున్నాయి.

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాను అక్కడ కబీర్ సింగ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ ను దక్కించుకున్నారు. ఇంకా టెంపర్‌ తో పాటు ఎన్నో సినిమాలను హిందీలో రీమేక్ చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పది సినిమాల వరకు తెలుగు నుండి హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలను మన వాళ్లే అక్కడ రీమేక్‌ చేస్తూ ఉంటే కొన్ని సినిమాలను హిందీ నిర్మాతలు రీమేక్ చేస్తున్నారు. నాని నటించిన జాతీయ అవార్డు మూవీ జెర్సీని హిందీలో అదే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌ సినిమాలు.. సూపర్ హిట్‌ అయిన సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలను కూడా అక్కడ రీమేక్ చేస్తున్నారు.

చిన్న సినిమాల్లో బ్రోచే వారు ఎవరురా అనే సినిమాను రీమేక్‌ చేయబోతున్నారు. ఇటీవలే నాంది సినిమాను రీమేక్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక రాజమౌళి ప్రభాస్ ల చత్రపతి సినిమాను కూడా హిందీలో రీమేక్‌ చేయబోతున్నారు. ఆ రీమేక్ లో మనోడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించబోతున్నాడు. ఇక తెలుగు లో నాని నిర్మించగా విశ్వక్ సేన్‌ నటించిన హిట్ సినిమాను హిందీలో రీమేక్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురంలో మరియు డీజే సినిమా లను కూడా రీమేక్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలు కాకుండా ఇంకా పలు సినిమాలు హిందీలో రీమేక్ చేసేందుకు సిద్దం అవుతున్నారు.

తెలుగు సినిమాలు చాలా వరకు హిందీలో కూడా డబ్బింగ్‌ అవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలుగా చాలా వరకు ప్రేక్షకుల ముందుకు వెళ్తున్నాయి. ఉత్తరాది ప్రేక్షకులకు తెలుగు సినిమాల రుచి ఇప్పటికే తెలిసింది. కనుక డబ్బింగ్ సినిమాలు అయినా కూడా తెగ ఆధరిస్తున్నారు. ఇక రీమేక్ సినిమా అయితే ఖచ్చితంగా బాగుంటుందని చెవులు కోసుకుంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు సక్సెస్ అయితే ముందు ముందు పాత కొత్త రీమేక్ లు చాలా అవుతాయి. అందుకే బాలీవుడ్ వారు ఈమద్య కాలంలో టాలీవుడ్ లో విడుదల అవుతున్న ప్రతి సినిమాపై ఒక కన్నేసి ఉంచుతున్నారు అనిపిస్తుంది. రీమేక్ రైట్స్ లేదా డబ్బింగ్‌ రైట్స్ ఏదో ఒకటి కొనుగోలు చేసేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారు.