Begin typing your search above and press return to search.

థియేట‌ర్లు తెరిచినా చైనాలానే అమెరికాకు!

By:  Tupaki Desk   |   19 Jun 2020 6:00 AM IST
థియేట‌ర్లు తెరిచినా చైనాలానే అమెరికాకు!
X
చైనాలో క‌రోనా మ‌హ‌మ్మారీని కంట్రోల్ చేశాక థియేట‌ర్లు తెరిచారు. సినిమాలు రిలీజ‌య్యాయి. చైనాతో పాటు వైర‌స్ ప్ర‌భావం లేని ప‌లు చోట్ల థియేట‌ర్లు తెరుచుకున్నాయి. కానీ దాని వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేద‌ని తేలింది. క‌రోనా మ‌హ‌మ్మారీ భ‌యాందోళ‌న‌లు ప్ర‌జ‌ల్ని విడిచిపెట్ట‌క‌పోవ‌డంతో ఎవ‌రూ థియేట‌ర్ల‌కు వెళ్ల‌లేదు. కేవ‌లం 2 శాతం ఆక్యుపెన్సీతో తీవ్ర న‌ష్టాలొచ్చాయ‌ని ఇంత‌కుముందు అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు తెలిపారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెరిచినా ఇదే స‌న్నివేశం ఉంటుంద‌ని అందుకే మ‌రో మూడునెల‌లు వేచి చూడాల‌ని ఒక ఎగ్జిబిట‌ర్ హోదాలో ఆయ‌న అన‌డంతో అంద‌రూ ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

ఆయ‌న చెప్పిన‌ట్టే అవుతోందిపుడు. ఇప్పుడే తొంద‌ర‌ప‌డి తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెరిచే ఆలోచ‌న అయితే లేదు. పైగా మ‌హ‌మ్మారీ అంత‌కంత‌కు పెరుగుతుంటే అస‌లు ఆ ఆలోచ‌నే చేయ‌డం లేదు. ఎగ్జిబిట‌ర్లు కంగారు ప‌డినా కానీ ప్ర‌భుత్వాల స్థాయిలో పాజిటివ్ గా స్పంద‌న లేదు. సినీపెద్దలు కూడా తెరిస్తే న‌ష్టాలు త‌ప్ప‌వ‌న్న హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి. అందుకే ఇంకా ఇక్క‌డ థియేట‌ర్స్ తెరిచే ఆలోచన చేయ‌లేదు.

స‌రిగ్గా ఇలాంటి స‌న్నివేశంలో తెలుగు సినిమాల‌కు అతి పెద్ద మార్కెట్ గా భావించే అమెరికాలో థియేట‌ర్లు తెరుస్తున్నారు. అక్క‌డ జూలై17 నుంచి థియేట‌ర్లు తెరిచేందుకు మార్గ‌ద‌ర్శ‌కాల్ని రెడీ చేస్తున్నారు. అమెరికాలో క‌రోనా కొంత స‌ద్ధుమ‌ణ‌గ‌డంతో థియేట‌ర్లు తెరిచేందుకు ట్రంప్ ప్ర‌భుత్వం సిద్దమ‌వుతోంది. టెక్సాస్ లాంటి వైర‌స్ ప్ర‌భావం ఆల‌స్యంగా ఉన్న చోట ఇంకా థియేట‌ర్లు తెర‌వ‌రు. కానీ ఇత‌ర చోట్ల తెరిచేందుకు రెడీ అవుతున్నారు.

ఒక‌వేళ అమెరికాలో స‌క్సెసైతే అక్క‌డ నిబంధ‌న‌ల్ని పాటిస్తూ.. ఇక్క‌డ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆలోచిస్తారేమో!! అయితే అమెరికాలో క‌ట్ట‌డి అవుతున్నా.. తెలుగు రాష్ట్రాల్ని క‌రోనా ఇంకా ఎక్కువ‌గానే భ‌య‌పెడుతోంది. ఈ సన్నివేశంలో ఇక్క‌డ అంత సులువు కాదేమోన‌ని విశ్లేషిస్తున్నారు. ఇక చైనా తీరుగానే థియేట‌ర్లు ఆక్యుపెన్సీ లేక‌పోతే అమెరికాలోనూ తెరిచినా ప్ర‌యోజనం ఉండదు. అలా జ‌రిగితే ఇక అన్నిచోట్లా ముందస్తుగా థియేట‌ర్లు తెర‌వాల‌నే కంగారుకు చెక్ ప‌డిపోయిన‌ట్టే.