Begin typing your search above and press return to search.

థియేట‌ర్ రంగంపై భ‌య‌ప‌డేదేం లేదు!

By:  Tupaki Desk   |   19 Sep 2021 2:30 AM GMT
థియేట‌ర్ రంగంపై భ‌య‌ప‌డేదేం లేదు!
X
ఓటీటీ వెల్లువ‌తో థియేట‌ర్ రంగం ప‌రిస్థితి ఎలా ఉండ‌నుంది? అస‌లు థియేట‌ర్ల మ‌నుగ‌డ సాధ్య‌మేనా? మునుముందు జ‌నం థియేట‌ర్ల‌కు వస్తారా రారా? అంటూ ర‌క‌ర‌కాలుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. డి.సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత ఈ క్రైసిస్ లో థియేట‌ర్ల ఉనికిపై బోలెడ‌న్ని సందేహాలున్నాయ‌ని చేతులెత్తేసారు.

కానీ కొంద‌రు అగ్ర నిర్మాత‌లు ఎగ్జిబిట‌ర్లు ఇంకా థియేట‌ర్ల రంగం ఉనికి పై ఎలాంటి సందేహాలు అవ‌స‌రం లేద‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌రిస్థితులు కొద్దిరోజులే. మునుముందు అంతా మారుతుంద‌ని అంటున్నారు. ఒక‌ప్పుడు థియేటర్ కి ఐదు వేలు రెంటు ఉండేది. ఇప్పుడు 5ల‌క్ష‌లు చెల్లించే స్థాయికి ఎదిగింది ప‌రిశ్ర‌మ‌. మునుముందు అది ఇంకా మారుతుంద‌ని ఓ సీనియ‌ర్ ఎగ్జిబిట‌ర్ కం నిర్మాత అన్నారు. ఎన్టీఆర్.. ఏఎన్నార్ లాంటి దిగ్గ‌జ హీరోల సినిమాల‌కు ఫైనాన్స్ చేసిన గొప్ప ఎగ్జిబిట‌ర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఆయ‌న ప్ర‌స్తుతం తెలంగాణ ఛాంబ‌ర్ లో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూనే నిర్మాత‌గా వ‌రుస చిత్రాల‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇక చాలా మంది ప‌రిశ్ర‌మ హీరోలు థియేట్రిక‌ల్ రంగం మ‌నుగ‌డ‌పై న‌మ్మ‌కంగా ఉన్నారు. త‌మ సినిమాల‌ను ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో మాత్ర‌మే చూడాల‌ని కోరుకుంటున్నారు. నాగ‌చైత‌న్య ల‌వ్ స్టోరి థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతుండ‌గా అడ్వాన్స్ బుకింగులు బావున్నాయ‌న్న టాక్ వినిపించ‌డం ఒక మేలిమ‌లుపుగా క‌నిపిస్తోంది. ఎగ్జిబిష‌న్ రంగంపై ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన‌ది లేద‌ని సంకేతం అందుతోంది.